పట్టభద్రుల పరీక్ష.. బొంతుతో కారుకు కలిసొచ్చేనా!

2
173


మకు అచ్చిరాకుండా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. త్వరలో జరగనున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ సీటును మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న గ్రేటర్ ఎన్నికలపై ఎమ్మెల్సీ ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా అక్కడ పాగా వేసేందుకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలో దించాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటీకే ఆ మూడు జిల్లాల నేతలతు బొంతు అభ్యర్థిత్వంపై సంకేతాలు ఇచ్చారట కేటీఆర్. మూడు జిల్లాల పరిధిలోని కొత్త ఓటర్ల నమోదును పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించారని తెలుస్తోంది. ఉస్మానియా యానివర్సిటిలో చదువుకున్న రామ్మోహన్ అక్కడి విద్యార్థి సంఘాలలో చురుకుగా పనిచేశారు. బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలోనూ కీలకంగా పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పటికీ కొందరు బీజేపీ సానుభూతిపరులు రామ్మోహన్ పట్ల సన్నిహితంగా ఉంటారనే టాక్‌ ఉంది.

తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్‌కు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ మేయర్‌గా ఐదేళ్లు పనిచేసిన రామ్మోహన్ బరిలోకి దిగితే అన్నివిధాలుగా కరెక్ట్ అని కేటీఆర్ నిర్ణయానికి వచ్చారట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా రామ్మోహన్ వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అశాజనక ఫలితాలు రాలేదు అధికా ర పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది జరిగిన హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానాని కి ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్‌ను బరిలోకి దింపినా గెలవలేకపోయారు. ఆ తర్వాత జరిగిన పలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై గెలిచి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

వచ్చే జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ లో ఈసారి వంద డివిజన్లు గెలిచి సెంచరీ కొట్టడం ఖాయమని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రకటించారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. బీజేపీ కూడా గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. నగరంలో పాదయాత్ర చేసే యోచనలో ఉన్నారు బండి సంజయ్. దీంతో గ్రేటర్ ఎన్నికలకు ముందే జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును దక్కించుకుంటే.. కమలం పార్టీని ముందే కంగు తినిపించవచ్చని గులాబీ పార్టీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావును మరోసారి బరిలోకి దింపాలని భావిస్తోంది. ప్రధాని మోడీ వేవ్, నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన జోష్ ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.

-S.S.Yadav, Senior Journalist

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here