ఓ సీత కథ..పిఠాపురం యువరాణి ప్రేమ పురాణం…ఇది కథ కాదు..!

0
182

వరు ఎందుకు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరికీ తెలియదు. పిఠాపురం యువరాణి సీతా దేవి ప్రేమ కథ కూడా అలాంటిదే. పిఠాపురం మహారాజా శ్రీ రాజా రావు వెంకట కుమార మహిపతి సూర్యా రావ్ బహదూర్, రాణి చిన్నమంబ దేవి కూతురు. అత్యంత సౌందర్యవతి. ఉయ్యూరు జమీందార్ ఎం. ఆర్. అప్పారావ్ బహదూర్ తో ఆమె వివాహం జరిగింది. అతని ద్వారా ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సీతాదేవి మొదటి నుంచి సోషల్ గా ఉండేది. ప్రిన్సెస్ నీలోఫర్ ఆమెకు దగ్గరి స్నేహితురాలు. విలాసవంతమైన జీవితం ఆమెకు అలవాటు. అలాంటి సీతాదేవి పెళ్లయి బిడ్డ పుట్టిన తరువాత మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అతను బరోడా మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్. అప్పట్లో ఆయన ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత ధనవంతుడు.

1943లో మొదటి సారి మద్రాస్ రేస్ కోర్స్ లో ఒకరినొకరు చూసుకున్నారు. సీతాదేవి సౌందర్యం అతడిని మంత్రముగ్దుడిని చేసింది. ఆమె పరిస్థితి కూడా అంతే. తొలి పరిచయంతోనే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో పడిపోయారు.


సీతాదేవి వివాహిత కావటంతో వారి పెళ్లికి చట్టం అడ్డుగా నిలిచింది. ఆమె హిందువు అయినందున ఇస్లాంలోకి మారితో అప్పటి చట్టాల ప్రకారం మొదటి భర్తతో వివాహం రద్దవుతుందని లాయర్లు సూచించారు. దాంతో ఆమె ఇస్లాంని స్వీకరించారు. 1943లోనే వారి వివాహం జరిగింది.

ఇంతవరకు బాగానే ఉంది కాని ఈ వివహం అంతకు ముందున్న బరోడా గైక్వాడ్ అమలు చేసిన బహుభార్యత్వం వ్యతిరేక చట్టాన్ని ఉ్లంఘించిందని బ్రిటిష్ అధికారులు పేచీ పెట్టారు. దీనిని ఎలా సమర్ధించుకుంటారో చెప్పవలసిందిగా బ్రిటిష్ వైస్రాయ్ గైక్వాడ్ ని ఢిల్లీకి పిలిపించారు. అయితే ఈ చట్టం బరోడా ప్రజలకు మాత్రమే వర్తిస్తుందని..తాను మహారాజు అయినందున తనకు మినహాయింపు ఉంటుందని వాదించాడు. వైస్రాయ్ న్యాయ సలహా తీసుకుని వీరి వివాహాన్ని అంగీకరించారు. కాని ఆమెను ‘హర్ హైనెస్’ అని పిలవటానికి మాత్రం అంగీకరించలేదు. ఎందుకంటే అది కేవలం అప్పటి ప్రిన్స్ లీ స్టేట్స్ పాలకుల మొదటి భార్యల ప్రోటోకాల్.
గైక్వాడ్ తో వివాహంతో సీతాదేవి జీవితం మరింత కలర్ ఫుల్ గా మారింది. భారతదేశం వెలుపల తాము జీవించటానికి అనువైన ప్రాంతం కోసం యూరప్ అంతా తిరిగి చివరకు మొనాకోను ఎంచుకున్నారు. అక్కడి మాంటే కార్లోలో ఇంద్రభవనం లాంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీతాదేవి అక్కడే స్థిరపడిపోయింది. మహారాజా మాత్రం బరోడా నుంచి నిధులను తరలించేందుకు తరచూ అక్కడిక వెళ్లేవాడు. ఇలా చేరవేసిన నిధులు , వజ్ర వైఢూర్యాలన్నీ మహారాణి సీతాదేవి సొంతం.


ఈ జంట అన్ని రకాలుగా అత్యంత విలాసవంతమైన జీవితం గడిపింది. అత్యంత ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తూ విపరీతంగా ఖర్చు చేసేవారు. కేవలం ఒక విదేశీ ప్రయాణానికి అప్పట్లోనే కోటి రూపాయల వరకు ఖర్చు చేశారంటే వారు ఎంత ఖరీదైన జీవితం గడిపారో అర్థం చేసుకోవచ్చు. గైక్వాడ్ బరోడా ఖజానా నుంచి పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు తీసుకున్నట్టు భారత అధికారుల ఆడిట్ లో తేలింది. ఆ మొత్తాలను తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో తన వార్షిక ఆదాయంలో నుంచి ఆ అప్పు తీర్చటానికి అంగీకరించాడు. అయితే అప్పటికే వీరు బరోడా ఖజానా నుండి భారీ మొత్తంతో పాటు అమూల్యమైన వజ్రా భరణాలను మొనాకోకు బదిలీచేశారు. బరోడాను స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసినప్పుడు భారత అధికారులు వాటిలో కొన్నిటిని తిరిగి పొందారు కానీ చాల వరకు మహారాణి వద్దే ఉండిపోయాయి.
అవకతవకలు, మోసాల అభియోగంతో 1951 లో గైక్వాడ్ పదవీచ్యుతుడయ్యాడు. మొదటి భార్య కొడుకు అతని స్థానంలోకి వచ్చాడు. సీతాదేవి 1956లో గైక్వాడ్ కి విడాకులు ఇచ్చింది.

గైక్వాడ్ తో విడిపోయిన తరువాత కూడా ఆమె తన రాచరిక బిరుదును అంటిపెట్టుకుంది. ఆమె రోల్స్ రాయిస్ ఇప్పటికీ బరోడా ఆయుధ చిహ్నాన్ని సూచిస్తుంది. ఆమెది ఆడంబరమైన జీవనశైలి. బారన్ డి రోత్స్‌చైల్డ్ బోర్డియక్స్ తాగేది. లూయిస్ XVI ఫర్నిచర్‌, అత్యంత ప్రత్యేకమైన పార్టీలకు హాజరుకావటం ఆమెకు అలవాటు. ఎక్కడికైనా వెళ్లినపుడు ఆమె వెంట ఒక పెద్ద వార్డ్ రోబ్ బ్ ఉండేది. వెయ్యి చీరలు, వందల జతల పాద రక్షలు, ఎన్నో ఆభరణాలు అందులో ఉండేవి.


ఈ మహారాణి గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. 1953 లో ఒక జత బెజ్వెల్డ్ యాంక్టెట్స్ ని హ్యారీ విన్‌స్టన్‌కు అమ్మేసింది. ఇది వజ్రాలతో చేసిన పచ్చల హారం. ఈ హారాన్ని డచెస్ ఆఫ్ విండ్సర్ వాలెస్ సింప్సన్డచ్ విన్ స్టన్ నుంచి కొనుగోలు చేసింది. 1957 న్యూయార్క్ బంతిలో డచెస్ దీనిని ధరించారు. అక్కడికి వచ్చిన అతిథులు ఈ హారాన్ని చూసి అబ్బురపడ్డారు. అప్పుడు సీతాదేవి కూడా అక్కడే ఉంది. ఈ హారం తన కాళ్లకు అందంగా ఉంటుందని అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. దీనిని నామోషీగా బావించిన డచెస్ హారాన్ని విన్‌స్టన్‌కు తిరిగి ఇచ్చేసింది.

అంతేకాదు సీతాదేవికి కార్లంటే మహా మోజు. తన మెర్సడెజ్ W126 బెంజ్ కారంటే మహా పిచ్చి. 1969లో ప్రఖ్యాత లైఫ్ స్టయిల్ మ్యాగజైన్ ఎస్క్వైర్ “సరదా జంటల” జాబితాలో సీతా దేవి, గైక్వాడ్ జంటను చేర్చింది.


ఎంత సంపద ఉన్నా ఇలా ఖర్చు చేస్తే ఏదో ఒక నాటికి కరిగిపోతుంది. సీతాదేవి విషయంలో కూడా అదే జరిగింది. 1974 నాటికి తాను ఎంతో అపురూపంగా చూసుకున్న ప్రియమైన ఆభరణాలను రహస్యంగా వేలం వేసే పరిస్థితి వచ్చింది.

1985 లో మహారాణి జీవితంలో పెను విషాదం సంభవించింది. తన ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం, మాదక ద్రవ్యం వ్యసనాలతో అతనికి ఆ స్థితి వచ్చింది. ఇది జరిగిన నాలుగేళ్లకు ఆమె చనిపోయింది. తెలుగునాట పుట్టి చివరకు పారిస్ లో తనువు చాలించింది సీతాదేవి. ఈమె కథ ఏ సినిమా కథని తీసిపోదు కదా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here