గ్రేటర్ లో కేటీఆర్ దూకుడు.. బల్దియా పీఠమే టార్గెట్?

5
228

గ్రేటర్ హైదరాబాద్ పై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కరోనా భయపెడుతున్నా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జోరుగా చేస్తున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయిస్తూ.. ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీపలే పలు ఫ్లైఓవర్లు, స్లిప్ రోడ్లను ప్రారంభించారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ పై పెద్దగా దృష్టి సారించని కేటీఆర్.. సడెన్ గా స్పీడ్ పెంచడానికి త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికలే కారణమంటున్నారు.
ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి కాల పరిమితి జనవరిలో ముగియనుంది. అంటే మరో నాలుగు నెలల్లో గ్రేటర్ బల్దియా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మళ్లీ గ్రేటర్ పీఠమే కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేటీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే సిటీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్నా… జోరుగా జనంలోకి వెళుతున్నారు మంత్రి. స్థానిక సమస్యలపై ఫోకస్ చేయాలని గ్రేటర్ నేతలను అలెర్ట్ చేశారు.


గ్రేటర్ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులకు టార్గెట్ పెడుతున్నారు కేటీఆర్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తున్నారు. బాలాపూర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ల పనులను వేగంవంతం చేసేలా చర్యలు చేపట్టారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైనా కేటీఆర్ ఫోకస్ చేశారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీనే గులాబీ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. రెండేళ్లలో లక్షన్నర ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్ చెప్పడంతో జనాలు నమ్మారు. ఏకపక్షంగా కారు పార్టీకి జై కొట్టారు. దీంతో జీహెచ్ ఎంసీలో గతంలో ఎప్పుడు లేనంతగా, ఎవరూ అంచనా వేయమంతా 99 డివిజన్లు గెలిచింది టీఆర్ఎస్. అయితే ఐదేెండ్లు కావస్తున్నా ఇండ్ల హామీని అమలు చేయలేకపోయింది. ఇప్పటివరకు నాలుగు వేల ఇండ్లు మాత్రమే పంపిణి చేశారు. మరో లక్ష వరకు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే నిధులు లేక కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో ఇండ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొన్ని బస్తీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామంటూ కట్టిస్తామంటూ ఉన్న ఇండ్లను కూల్చేశారు. దీంతో వారంతా రోడ్డున పడ్డారు. ఐదేండ్లైనా ఇళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా తమకు ఇండ్లు ఇవ్వాలంటూ బల్దియా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అంశం తమకు నష్టం కలిగిస్తుందని ఊహించిన కేటీఆర్ ముందే అప్రమత్తమయ్యారు. గ్రేటర్ పరిధిలోని ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయించారు. అధికారులకు టార్గెట్ పెట్టి మరీ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. డిసెంబర్ లోగా 85 వేల ఇళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రేటర్‌ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల ఇళ్ల చొప్పున పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. విపక్షాలు మాత్రం కేటీఆర్ తీరుపై మండిపడుతున్నాయి. తప్పుడు హామీలతోపేదలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఐదేండ్లు పట్టించుకోకుండా మళ్లీ ఎన్నికల వేల హడావుడి చేస్తూ మరోసారి గ్రేటర్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.

-ఎస్.ఎస్.యాదవ్,సీనియర్ జర్నిలిస్ట్

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here