దుబ్బాకపై కాంగ్రెస్ గేమ్ ప్లాన్.. రాములమ్మ ఎంట్రీ..బీజేపీకి టెన్షన్..!

72
462

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక జరగనున్న దుబ్బాక అసెంబ్లీ సీటుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని సగం గ్రామాలను ఆయన ఇప్పటికే చుట్టేశారు. యూత్ టార్గెట్ గా రఘునందన్ రావు ప్రచారం సాగిస్తున్నారు. గ్రామాల్లోకి యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రఘునందన్ ప్రచారంతో దుబ్బాక బీజేపీలో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. వరుసగా ఎన్నికల్లో ఒడిపోయారనే సెంటిమెంట్ కూడా ఉంది. అటు కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కమలం పార్టీ అంచనా వేస్తోంది. అన్ని అనుకూలంగా ఉండటంతో దుబ్బాకపై భారీ ఆశలే పెట్టుకున్నారు కమలనాథులు

         అయితే ప్రచారంలో జోరు మీదున్న దుబ్బాక బీజేపీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో విజయశాంతి ఉన్నారనే ప్రచారం కాషాయ పార్టీలో కలవరానికి కారణమైంది. రాములమ్మ గతంలో బీజేపీలో చాలా కాలం ఉన్నారు. ఐదేండ్లు మెదక్ ఎంపీగా కూడా పని చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆమెకు అనుచర వర్గం ఉంది.ముఖ్యంగా దుబ్బాక బీజేపీ నేతలతో రాములమ్మకు మంచి సంంబధాలున్నాయి. నియోజకవర్గంలోని గ్రామ స్థాయి నేతలను కూడా ఆమె గుర్తు పడతారు. యూత్ లో విజయశాంతిపై క్రేజీ ఇంకా తగ్గలేదు. ఇదే ఇప్పుడు బీజేపీని షేక్ చేస్తోంది. రాములమ్మ పోటీ చేస్తే బీజేపీ ఓట్లకే ఎక్కువగా గండి పడుతుందని కమలం నేతలు భయపడుతున్నారు. బీజేపీ ఎక్కువగా యూత్ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. విజయశాంతి పోటీ చేస్తే.. కొంత యువత కూడా ఆమెకు సపోర్ట్ చేయవచ్చు. అదే జరిగితే తమకు కష్టమని రఘునందన్ రావు టీమ్ వర్రీ అవుతోంది.

మరోవైపు విజయశాంతిని పోటీని దింపాలనే కాంగ్రెస్ ఆలోచన వెనక పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అయితే ఇకపై టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. ఇటీవల కేసీఆర్ సర్కార్ పై ఆరోపణలు తీవ్రతరం చేశారు బీజేపీ నేతలు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి బీజేపీ హైకమాండ్ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీజేపీ బలపడితే తమకు నష్టమని కాంగ్రెస్ భావిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినా.. రెండో స్థానంలో నిలిచినా తమ పని అయిపోయినట్లేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే రాములమ్మతో పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. విజయశాంతి ఇమేజ్ పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. రాములమ్మతో బీజేపీకి ఓట్లకు గండి పడుతుందని, దీంతో తాము గెలవడమో లేక సెకండ్ ప్లేస్ లో ఉండటమే ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా రాములమ్మను పోటీకి పెట్టాలని కాంగ్రస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

            ఇక అధికార టీఆర్ఎస్ కూడా దుబ్బాకలో ప్రచారం ముమ్మరం చేసింది. మంత్రి హరీష్ రావు ఇప్పటకే పలు మండలాలు పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూనే.. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఇతర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మండలాల వారీగా దుబ్బాక నియోజకవర్గంలో సమావేశాలు పెడుతున్నారు . కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవరూ పోటీ చేసినా తమ విజయానికి ఢోకా లేదంటున్నారు గులాబీ నేతలు. మొత్తానికి రాములమ్మ పోటీ ప్రచారంతో దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదంతా బాగానే ఉంది..కానీ ఇంతకూ విజయశాంతి ఈ పోటీకి అంగీకరిస్తుందా అన్నది అసలు ప్రశ్న. త్వరలో బీజేపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె రంగంలోకి దిగుతారంటే కాస్త ఆలోచించాల్సిందే మరి. 

-ఎస్.ఎస్. యాదవ్, సీనియర్ జర్నలిస్ట్

72 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here