త్వరలోనే గాంధీ ఆసుపత్రిలో సాధారణ సేవలు..?

3
193


కరోనా నేపథ్యంలో పూర్తిగా కోవిడ్ హాస్పటల్ గా మారిన గాంధీ ఆస్పత్రి త్వరలో సాధారణ వైద్య సేవల ను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం అధికారులు ఆస్పత్రిని నాన్‌ కొవిడ్‌ వైద్య సేవలకు సన్నద్ధం చేస్తు న్నారు. ఇదివరకటిలా సాధారణ సేవలను అందించే దిశగా వైద్యాధికారులు దృష్టి సారించారు. ఒకవైపు కొవిడ్‌ రోగులకు చికిత్సలు అందిస్తూనే.. మరోవైపు అన్ని వ్యాధులకు చికిత్సలు అందించాలని యోచిస్తున్నారు.

మార్చి 2న గాంధీ ఆస్పత్రిలో మొదటి కరోనా కేసును అడ్మిట్‌ చేసుకొని చికిత్సలు ప్రారంభించగా, ఆ తర్వాత క్రమక్రమంగా కరోనా ఉధృతి పెరగడంతో ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించి నోడ ల్‌ వైద్యకేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ తరువాత ఫీవర్‌, కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆస్పత్రి, టిమ్స్‌.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నూ కరోనా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడికక్కడ జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా సేవలు అందిస్తుండడంతో కొంతమేరకు గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గింది.

సోమవారం నాటికి గాంధీలో 664 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా, ఆ సంఖ్య 300 మందికి తగ్గగానే సాధారణ వైద్య సేవలను అందించాలని సన్నాహాలు చేస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. కొవిడ్‌ బాధితులకు ప్రత్యేక బ్లాక్‌లు ఏర్పాటు చేసి వారు మరో మార్గం ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

గాంధీ ఆస్పత్రిలో ఇంతకుమునుపు సోమ, మంగళవారాల్లో 1,500 నుంచి 1,800 వరకు ఓపీ ఉండేది. గత ఏడు నెలలుగా ఇక్కడ ఓపీ సేవలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో పాత భవనం సీజ్‌ చేయడంతో రోగులకు చికిత్సలు అందించడం వైద్యులకు కష్టంగా మారింది. గాంధీలో సాధారణ సేవలను పునరుద్ధరిస్తే ఉస్మానియాపై భారం తగ్గనుంది.

ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కరోనా రోగులకు కూడా గాంధీ ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆర్ధోపెడిక్‌, జనరల్‌ సర్జరీ, అపెండిక్స్‌కి సంబంధించిన పది ఆపరేషన్లు నిర్వహించారు. త్వరలో నెఫ్రాలజీ, మరికొన్ని విభాగాల ఆపరేషన్లు కూడా చేయనున్నారు. ఇక కరోనాతో అడ్మిట్‌ అయిన 330 మంది గర్భిణులకు సిజేరియన్‌ శస్త్రచికిత్సలతో సుఖప్రసవాలను నిర్వహించారు.

వీలైనంత త్వరగా గాంధీలో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరిస్తే సామాన్యులు, పేదలు ఊపిరి పీల్చుకుంటారు. కోవిడ్ కారణంగా వైద్య సేవలకు పేదలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here