బ్రిటన్ సంతాన లక్ష్మి …22వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

0
169

అధిక జనాభా కలిగిన చాలా పేద దేశాలలోనే ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలను కనటమే గగనం. ఐతే అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా సహ పలు ప్రపంచ దేశాలలో కుటుుంబ నియంత్రణ నిబంధనలు లేవు. కనే ఓపిక ఉంటే ఎంతమందినైనా కనొచ్చు. గతంలో మన భారత దేశంలో కూడా ప్రతి కుటుంబంలో పది పన్నెండు మందికి మించి సంతానం ఉండేది. ఐతే ఫ్యామిలీ ప్లానింగ్ పాటించటం ద్వారా పెద్ద కుటుంబాలు కనుమరుగయ్యాయి. కేవలం ఒక్కరు లేదా ఇద్దరు ..మహా అయితే ముగ్గురు. ఇక నలుగురిని కంటే విచిత్రమే.

ఇక అసలు విషయంలోకి వస్తే బ్రిటన్ కు చెందిన 45 ఏళ్ల స్యూ రాడ్‌ఫోర్డ్ ఏప్రిల్ లో తన 22వ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ పాప పేర హైడీ. బ్రిటన్ లో ఇదే అతి పెద్ద ఫ్యామిలీ. హైదీ ఆమెకు 11వ కుమార్తె. పద్నాలుగేళ్లప్పుడు తొలిసారి తల్లైన స్యూ రాడ్‌ఫోర్డ్ తన 45 ఏళ్ల జీవితంలో 15 ఏళ్ల కాలానికి పైగా గర్భంతోనే గడిపటం విశేషం. ఇప్పుడు వీరికి 11 మంది అబ్బాయిలు..11 మంది అమ్మాయిలు.

ఇంతమందిని కన్నప్పటికీ డెలివరీ అప్పుడు ఆమె ఏనాడూ భయపడలేదు. కానీ 22వ కాన్పు కరోనా కష్టకాలంలో జరిగింది. భర్త ని డెలివరీ సమయంలో తన దగ్గర ఉండేందుకు అనుమతిస్తారో లేదోనని చాలా టెన్షన్ పడ్డానంటారు స్యూ. ఈ పిల్లలందరికి తండ్రి ..ఆమె భర్త నోయల్ రాడ్‌ఫోర్డ్ తొమ్మిదవ బిడ్డ పుట్టిన తరువాత పిల్లలు పుట్టకుండా వ్యాసెక్టమీ చేయించుకున్నాడు. కాని తరువాత దానిని రివర్స్ చేయించుకున్నాడు. ఈ జంట సంతానంలో పెద్దవాడు క్రిస్టోఫర్ వయస్సు 30 ఏళ్లు. తరువాత ఆడపిల్ల సోఫీ.. అమెకి 26 ఏళ్లు. సోఫీ తరువాత బిడ్డకు బిడ్డకు మధ్య ఏడాది..ఏడాదిన్నర కంటే ఎక్కువ గ్యాప్ లేదు.

ఈ కుటుంబం ఒక బేకరీని నడుపుతుంది. పది పడక గదులున్న కుటుంబంలో నివసిస్తోంది. వారికి ఆరుగురు మనవలు మనవరాళ్లు. మనం ఒకరిద్దరు పిల్లలుంటేనే వారిని పెంచి పోషించలేక సతమతమవుతుంటాం. కానీ ఇంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకురావటం అంటే మాటలా. అసలు ఇంత పెద్ద కుటుంబ పోషణకు ఎంత ఖర్చవుతుంది. ఎంత సంపాదన ఉండాలి..ఎంత పెద్ద ఇల్లు కావాలి. ఎంతమంది నౌకర్లు ఉండాలి.. వారిని స్కూలుకు పంపటం వంటి విషయాలు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.రాడ్ ఫోర్డ్ సంపాదనలో చాలా వరకు కుటుంబ పోషనకే సరిపోతుంది. ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక రాయితీలు లాంటివి ఏమీలేవు. ఒక వారానికి అయ్యే తిండి ఖర్చే పాతిక వేల రూపాయల పై మాటే. వేసవిలో అయితే అది 30 వేలు దాటుతుంద. ఒక్కసారి కుటుంబంతో బయటకు వెళితే బిల్లు పదిహేను వేలు అవుతంది.

పిల్లలకు బడి లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. అస్తమానం ఒకరితో ఒకరికి పోట్లాట. ఏడుపులు.. కిందపడి దెబ్బలు తగిలించుకోవటం..ఇలా ఎన్నో .. పిల్లలు ఉన్నంత సేపూ ఇల్లంతా గజిబిజిగగా ఉంటుంది, వాళ్లు పుడుకున్న తరువాత ఇంటిని సర్దుకునే పనిలో పడుతుంది స్యూ. ఇక బట్టలు ఉతకటం ఆమెకు పెద్ద పని. వీరందరి బట్టలను ఒకే సారి ఉతికేంత లోడ్ వాషింగ్ మెషిన్ కు లేదు. అందుకే రోజుకు మూడు నాలుగు సార్లు బట్టలు ఉతకాల్సి వస్తుంది. ఒకరి బట్టలు ఒకరికి కలవకుండా వాటిని వేరు వేరుగా ఉంచటం ఆమెకు మరో పెద్ద పని. ఇక ఎక్కడికైనా వెళితే వాళ్ల బట్టలను గుర్తుపెట్టుకునేలా ఏడు సూట్ కేసులో సర్దుతుంది.

ఇంత మంది పిల్లలతో ఈ దంపతులకు ఏకాంతం అనేది చాలా చాలా తక్కువే. చిన్న పిల్లలు బడికి, పెద్ద పిల్లలు పనికి వెళ్లినప్పుడు మాత్రమే భార్యాభర్తలు కాస్త తీరిగ్గా గడిపే అవకాశం దొరుకుతుంది, పిల్లలను బడికి పంపించేప్పుడు వారికి క్యారేజ్ కట్టిపెట్టటం ఆమెకు పెద్ద పని. స్కూలు నుంచి రాగానే తమకు అది కావాలి…ఇది కావాలని పేచీ పెడుతుంటారు. వారికి ఏదో ఒకటి సర్దిచెప్పి బండి లాగిస్తున్నా నంటోంది స్యూ. ఎదిగిన పిల్లలు తనకు తోడ్పాటుగా ఉంటారని…ఎప్పుడైనా భర్తతో కలిసి బయటకు వెళితే వారే తమ తోబుట్టువులను సంబాళిస్తారని చెప్పింది. అయితే తామిద్దరం బయట గడిపే సందర్భాలు చాలాచాలా తక్కువంటారామె.

రాత్రి పడుకునేసరికి ఏ అర్థ రాత్రో వుతుంది. ఎప్పుడూ ఇంట్లో చంటి బిడ్డ ఉంటుంది. పాప ఎప్పుడు పాలు కావాలని ఏడుస్తుందో తెలియదు. అందుకే రాత్రంగా కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుందంటారు స్యూ. ఏదేమైనా దేవుడు ఇచ్చిన బిడ్డలను కాదనలేం కదా..ఎంత మందిని ఇచ్చినా కాదనం అంటారు రాడ్ ఫోర్డ్ దంపతులు… నారు పోసిన వాడే నీరు పోస్తాడనే అర్థంలో!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here