బ్రెయిన్‌ హ్యామరేజ్‌..? ఆస్పత్రి వద్ద ఉద్విగ్నత

0
161

అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం
వెల్లడించిన చెన్నై ఎంజీఎం దవాఖాన
బ్రెయిన్‌ హ్యామరేజ్‌ అయినట్టు సమాచారం
ఎస్పీ ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి ఆరా

బాలూ పరిస్థితి అలాగే ఉంది. అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన కోసం లక్షలాది మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా విషమించింది. అత్యంత గరిష్ఠ స్థాయిలో లైఫ్‌ సపోర్ట్‌ అవసరమవుతోంది. ఆయన పరిస్థితిని నిపుణులైన వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటిం చింది.

బాలు ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన వెలువడిన వెంటనే ఆయన అభిమానులు, సన్నిహితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఒక్కొక్కరుగా ఆస్పత్రి వద్దకు చేరుకోసాగారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆయన సన్నిహితుడు కమల్‌ హాసన్‌ ఆస్పత్రికి వచ్చారు. తిరిగి వెళుతూ… పరిస్థితి సీరియ్‌సగానే ఉందని, లక్షలాదిమంది అభిమానులు, సినీ రంగ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని వారు నమ్మే భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అని క్లుప్తంగా చెప్పారు.

రాత్రి 9 గంటల సమయంలో బాలు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు కొందరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులూ అక్కడ గుమికూడారు. ‘బాలు తిరిగి రావాలి’ అంటూ ప్రార్థనలు చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. ప్రసారమాధ్యమాల్లో కూడా నిరంతరాయంగా బాలు ఆరోగ్యంపై వార్తలు ఇస్తూనే ఉ న్నారు. లక్షలాది మంది అభిమానులు.. ఆయన గురించి, ఆయన సాధించిన ఘనతల గురించి, అవార్డులు, రివార్డుల గురించి సామాజిక మాధ్యమాల్లో గుర్తుచేసుకున్నారు. భగవంతుడి దయతో ఆయన కోలుకోవాలని ప్రార్థించారు.

బాలు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే ఇతర వైద్యనిపుణులతో కూడా సంప్రదించి బాలుకు మరింత మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే.. బాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. కాగా.. బాలు ఆరోగ్య పరిస్థితిపై గురువారం రాత్రి పొద్దుపోయాక మరో బులెటిన్‌ విడుదల చేస్తామని పేర్కొన్న ఆస్పత్రి వర్గాలు రాత్రి 1.30 గంటల దాకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కుటుంబసభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది.

మరి కొద్ది సేపట్లో బాలూ ఆరోగ్యంపై తాజా పరిస్థితి తెలిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here