భారతీయ ప్రేక్షకునికి అందని ఆదూర్ ‘అనంతరం’

75
426

“అనంతరం” ఆంగ్ల అర్థం మోనోలాగ్ అంటే స్వగత భాషణము. అత్యుత్తమ భారతీయ చిత్రాలలో ఇదీ ఒకటని నిర్ధ్వందంగా చెప్పవచ్చు. ప్రఖ్యాత మళయాళీ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ రూపొందిన ఈ చిత్రం 1987 లో విడుదలైంది. మమ్మూటి, శోభన, అశోకన్ ప్రధాన తారాగణం. ఈ సినిమా భారతదేశంలో నిర్మించిన గొప్ప సినిమాలలో ఒకటిగా సినీ విమర్శకులు చెబుతారు. ఈ సినిమాను నేను రెండు సార్లు చూసాను. పదిహేనేళ్ల క్రితం ఒకసారి..మళ్లీ ఈ మధ్య మరోసారి చూశాను. ఇప్పటికీ ఈ సినిమా నాకు ఒక ఆశ్చర్యమే. నాన్ లీనియర్ నరేటివ్ టెక్నిక్ తో ఆదూర్ ఈ సినిమాను రూపొందించారు. 1987 లో గ్రామీణ నేపద్యంలో కథ నడిపిస్తూ దర్శకులు తీసిన విధానం చూసి చాలా గొప్పగా అనిపిస్తుంది.

అనంతరం కథలో ప్రధాన పాత్ర అజయన్ ఒక అనాథ.. పుట్టగానే అస్పత్రిలో తల్లి వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ హాస్పిటల్ డాక్టర్ ..అజయన్ ని చేరదీసి సొంత కొడుకులా పెంచుతాడు. చిన్నతనంలో అపారమైన తెలివితేటలు, టాలెంట్ ఉన్న అజయన్ భవిష్యత్తు పై పెంపుడు తండ్రికి ఎంతో నమ్మకం. అజయన్ టీన్స్ లో కి వస్తున్నప్పటి నుంచి అతని లో మానసికమైన మార్పులు వస్తూ వుంటాయి. చదువు పట్ల శ్రద్ద తగ్గిపోతుంది. భవిష్యత్తు పై పట్టుదల, ఆశ ఉండవు. ఆ సమయంలో పెంపుడు తండ్రి మరణిస్తాడు. అతని కొడుకు మమ్ముటీ. అజయన్ అంటే అతనికి ఎంతో ప్రేమ, ఆదరణ. తమ్ముడికి ఏ విషయంలో లోటు చేయడు. మమ్మూటి పెళ్ళి శోభన తో జరుగుతుంది. వదినను మొట్టమొదటి సారి అన్నతో చూసినప్పటి నుంచే అజయన్ ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమె పట్ల ఆకర్షణ పెరిగి దాని వల్ల అన్న బాధపడతాడని ఇంటి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళీపోతూ వదిన చేతిని అతను ముద్దు పెట్టుకున్న విధానంలో ఆమె పై అతని కోరిక కనిపిస్తూ ఉంటుంది. తమ్ముడిని మళ్ళీ మాములు మనిషిని చేయాలని అన్న ప్రయత్నిస్తూ ఉంటాడు…. ఇది అజయన్ మనకు చెప్పే అతని మొదటి జీవిత కథ. పైకి ప్రేక్షకుల మైన మనకు కనిపించీ కథావస్తువు.అజయన్ పట్ల కొంత బాధ, కోపం, అతని గిల్ట్ అతను అనుభవించవలసిన శిక్షలా మనకు అనిపిస్తుంది.

ఇప్పుడు దర్శకుడు అజయన్ తో మరొ కథ చెప్పిస్తారు. చిన్నప్పుడు ఇంటికి తీసికుని వచ్చిన డాక్టర్ ఈ బిడ్డ సంరక్షణ భాద్యత ముగ్గురు నౌకర్లకు అప్పజెప్పి తన పనులతో ఎక్కువ కాలం బైట గడుపుతూ ఉంటాడు. ఈ నౌకర్లు వారు చేసే చీకటి పనులకు, దొంగ విషయాలకు ఈ అబ్బాయి అడ్డు అవకుండా అతని లో తీవ్రమైన భయాలను కలిగించి నియంతల్లా అతన్ని అణిచి తమ కంట్రోల్ లో ఉంచుకుంటారు. చదువు కోసం బైటికి వచ్చిన తరువాత యూనివర్శిటి రోజుల్లో నళిని అనే అమ్మాయితో అతనికి పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య అన్యోనత పెరుగుతుంది. అయితే అతని జీవితంలోకి వచ్చినంత వేగంగా ఏ కారణం చెప్పకుందా నళీని మాయమవుతుంది. అప్పటికే మానసికంగా కృంగి ఉన్న అజయన్ బాధతో మత్తుకు బానిసవుతాడు. అతని స్థితి చూసి అతని పెంపుడు తండ్రి ఎంతో దుఖిస్తాడు. ఇంటికి వెళ్ళాక గుండె పోటూతో మరణిస్తాడు. పెంపుడు తండ్రి మరణం అతన్ని ఇంకా డిస్ట్రబ్ చేస్తుంది. అప్పుడే అన్న భార్య స్థానంలో అచ్చం నళిని లా ఉన్న సుమ ను చూసి తట్టుకోలేకపోతాడు. అన్న అతనిలో మార్పును గమనించి వైద్యపరంగా అతన్ని ట్రీట్ చేయాలనుకునేంతలో వదిన నళినేఅని, సుమ అని పేరు మార్చుకుని తనని అన్నని మోసం చూస్తుందని ఆమెపై కోపాన్ని పెంచుకుంటాడు. అన్న దగ్గర ఈ అక్కసు వెళ్ళగక్కి అతని కోపానికి గురి అవుతాడు.ఈ కథ చూసిన తరువాత అజయన్ పై మనకు సానుభూతి పెరుతుగుంది. అన్న పాత్ర పై జాలి కలుగుతుంది. శోభన చూసే అనుమానం కలుగుతుంది. నిజం మాత్రం ఎంటో అర్ధం కాదు.

అయితే మొదటి నుండి అజయన్ లో బై పోలార్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రెండు కథలలో ఏది నిజం, ఏది ఊహ, లేదా రెండూ నిజమేనా అన్న సంగతిని దర్శకుడు తేల్చడు. జీవితం అంటే పర్స్పెక్టివ్ అని, నిజం అన్నది మనం ఆలోచించే, లేదా చూసే పర్స్పెక్టివ్ పై ఆధారపడి ఉంటుందని ఒకోసారి నిజం అబద్దం కలిసిపోయి ఉంటాయని వాటిని విడదీయడం కష్టమని చెప్పడం దర్శకుడు ఉద్దేశం కావచు. ఈ సినిమా చూసే స్థాయిలో ఇప్పుడు కూడా భారతీయ ప్రేక్షకుడు లేడన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు. కాని 33 సంవత్సరాల క్రితమే ఇంత విన్యూత్నమైన విషయంతో ఒక సినిమా వచ్చిందని, దాన్ని మేధావులు మెచ్చుకున్నారని. అదీ మన దక్షిణ ప్రాంతం నుండి వచ్చిందని తెలుసుకుని నిజంగానే చాల థ్రిల్లింగా అనిపించింది.

సినిమాకు ముగుంపు లేదు. అజయన్ జీవితంలో సత్యా అసత్యాలతో దర్శకుడికి పనిలేదు. రెండు గంటలసేపు ఒకే జీవితానికి సంబంధించిన భిన్న పర్స్పెక్టివ్ లతో విషయాలలో నిజా నిజాలను మనకే వదిలేస్తూ కథ చెప్పుకుంటూ వెళ్ళిన దర్శకుని ప్రతిభ మనకు కనపడుతుంది. చిన్నప్పటినుండి మానవ సంబంధాల చూట్టూ ఒంటరితనాన్ని మోసాన్ని మాత్రమే చూసే అజయన్ జీవితంలో ఏది నిజం ఏది అతని ఊహ అన్న విషయం కన్నా వీటి మధ్య నలిగిపోయే అతని మనసు పడే వేదన తో మనం ప్రయాణిస్తాం. ఏదేమైనా చాలా వైవిద్యంగా తీసిన సినిమాగా ఇది ఎప్పటికీ మనతో ఉండిపోతుంది.

75 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here