రేవంత్ పయనం ఎటు? కొత్త పార్టా..? వేచి చూసే దోరణా..?

0
46

ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్. యూత్ లో ఫాలోయింగ్ ఇతర నేతల కన్నా ఎక్కువే. అధికారంలో ఉన్నప్పుడు అందరూ జీ హుజూర్ అంటూ అడుగులకు మడుగులొత్తుతారు. కానీ విపక్షంలో ఉన్నప్పుడు జనాన్ని తన వెంట ఉంచుకోగలిగేవాడే నాయకుడు. అలాంటి వారిలో రేవంత్ రెడ్డి ఒకరు అని చెప్పవచ్చు. అయితే ఓ పార్టీలో ఉన్న నాయకుడు ఎంత డైనమిక్ అయినా అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏమైనా చేయగలడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిస్థితి ఇదే. పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు ఆయన పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇన్నాళ్లూ పార్టీని పట్టుకుని ఉన్న సీనియర్లు రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించకపోవటం సహజం.

తొలినాళ్లలో దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాంటిదే. సీనియర్లు ఆయనకు అడుగడుగునా అడ్డుపడ్డారు. అయినా అసమ్మతి నేతగా వైఎస్ ఆర్ పార్టీలో పోరాడి అనుకున్నది సాధించాడు. అవిభక్త ఆంధ్రప్రవేశ్ లో అన్నీ తానై కాంగ్రెస్ పార్టీని నడిపించారు. ఎదురులేని నేతగా ఎదిగారు. అత్యంత పిన్న వయస్సులోనే పీసీసీ పగ్గాలు చేపట్టినా సీఎం కావటానికి ఆయనకు 20 ఏళ్లకు పైనే పట్టింది. ఒక్క మన దగ్గరే కాదు.. అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది. మధ్యప్రదేశ్లో సిందియా.. రాజస్థాన్లో పైలట్ లను తాజా ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఆ లెక్కన చూస్తే రేవంత్ కు ఏకపక్షంగా అధిష్టానం ఇప్పుడే అన్ని పవర్స్ ఇస్తుందనుకోవటం అత్యాశే కాదు అవివేకం కూడా.. అయితే మరి తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కి ధీటుగా కాంగ్రెస్ పార్టీని నడిపించి ..క్యాడర్ లో మళ్లీ అధికారం ఆశలు చిగురింపచేయగల సత్తా ఉన్న నాయకుడు ఎవరు?

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిర కాలం నాటి కాంగ్రెస్ కాదు..జనం కూడా అప్పటి జనం కాదు. ఎన్నికల ముందు ఢిల్లీ నుంచి వచ్చి జనం ముందు చేతులు ఊపి వెళ్లిపోతే ఓట్లు పడవు. రాష్ట్రంలో ఓ బలమైన జన నేత అవసరం ఆ పార్టీకి ఉంది. కానీ, కాంగ్రెస్ లో ఏ ఒక్క నేతకు ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒక్కో జిల్లాలో ఒక్కరిద్దరు నేతలు పార్టీని చెప్పు చేతల్లో పెట్టుకుని అధిష్టానం వద్ద చక్రం తిప్పుతారు. ఇప్పుడు ఆ నాయకులంతా పీసిసి పీఠంపై కన్నేశారు. మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తూర్పు జగ్గారెడ్డి ఇలా చాలా మంది పీసీసి పీఠంపై కన్నేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డికి చాలా అవిషయాలలో పీసీసీ పీఠం అందుకునే అవకాశాలు మిగతా వారికన్నా ఎక్కువనే చెప్పొచ్చు. కానీ, సీనియర్లను కాదని అధిష్టానం ఆయనకు ఆ పదవి కట్టబెడుతుందా అన్నది ప్రశ్న.


రేవంత్ తనకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇప్పటిలాగే ఒంటరి పోరాటం చేస్తారా అన్నది కూడా అనుమానమే. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్టు ఇటు ప్రధాన మీడియా స్రవంతిలో అటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ పెట్టేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్నదానిపై సర్వేలు కూడా చేయించినట్టు తెలుస్తోంది. అయితే ఆ సర్వే ఫలితాలు అంత అనుకూలంగా లేనట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి నాయకులు, క్యాడర్ పెద్ద ఎత్తున తన వెంటనడుస్తుందని రేవంత్ నమ్మకం. అలాగే తెలంగాణ లోని టీడీపీ మాజీ క్యాడర్ అంతా తనతో చేరుతారని విశ్వసిస్తున్నారనా గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఐతే, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున ఆయన తొందరపాటు నిర్ణయాలు తీసుకోరన్నది నిజం. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఎప్పుడూ జనంలో ఉండాలని కోరుకుంటారు. వారిని నిరోధించాలని తమ పార్టీ వారే ప్రయత్నిస్తే పార్టీలో ఎక్కువ కాలం కొనసాగటం కష్టమే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here