మీడియా ‘కసాయి’ తనం…

0
56

ఏదైనా ఘోరం జరగటం ఆలస్యం, కసాయి అని రాస్తారు. అమానుషం అని కూడా రాస్తారు కానీ,అది సరిపోదనుకుంటా.. ఎంత రాసినా కసాయి అనే పదం పడితే తప్ప శాటిస్‌ఫాక్షన్‌ కలగదేమో ! అదొక కులమనీ, వృత్తి అనీ – అలా రాయకూడదనీ ఎప్పటికి అర్థం చేసుకుంటారో ? ఓ దినపత్రికలో – ఎడిటోరియల్‌ సెక్షన్‌లో, నిషేధిత పదాల జాబితా అంటించి ఉంటుంది. ఆ పదాలన్నీ ఒక పైకులాన్ని సూచించేవే . వాటిని వార్తల్లో వాడకూడదన్న మాట. మంచిదే. మరి ఆ చేత్తోనే కిందికులాలను కించపరిచే మాటలను కూడా రాయకండిరా బాబూ అని, ఇంకో లిస్టు పెడితే ఇంకెంత హుందాగా ఉండేది? పెట్టరు. ఎందుకంటే, మీడియా పైవాళ్లదే కానీ – కిందివాళ్లది కాదు. అందుకే కసాయి లాంటి పదాలు మనకి టీవీలో, పేపర్లో నిత్యం కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రేమ బేస్డ్‌గా వచ్చే హత్యలు, ఆత్మహత్యల వార్తల్లో కనిపించే ఇన్సెన్సిటివిటీ గురించి చెప్పనలవి కాదు. పరువుహత్య అని రాస్తున్నారు. పాపం, పరువు కోసం చేశారేమోనన్న జస్టిఫికేషన్‌ ఆ పదంలో ఎంతో కొంత ధ్వనించటం లేదా? దీనికి బదులు కులదురహంకార హత్య అని రాయమంటే,ఎవరూ వినిపించుకోరు. ఇంకో ఘోరమైన పదం – “ప్రేమ వ్యవహారం’. వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యహారం ఉందని, ఈ ఘోరానికి అదే కారణమనీ రాస్తారు, టీవీల్లో కూడా డిటో. మానవజీవితంలో ఒక అతి విలువైన అనుభూతిని, అత్యున్నతమైన సంవేదనను – వ్యవహారం స్థాయికి దిగజార్చిన ఘనత, తెలుగు జర్నలిజామతల్లి ముద్దుబిడ్డలదే. పాపం, వాళ్లు మాత్రం ఏం చేస్తారు? వాళ్లు కూడా, ప్రేమను వ్యతిరేకించే సమాజం నుంచే కదా వచ్చారు. వాళ్ల మైండ్‌సెట్‌ ఎలా ఉన్నా, మేనేజ్‌మెంట్లు కూడా ఒప్పుకోవు. అందుకే వాస్తవాన్ని చెబుతున్నట్టు చెబుతూనే , దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తారు. కులపిచ్చికి బలైపోతే – ఇలా ప్రేమాగ్నికి బలయ్యారనీ , కులోన్మాదంతో చంపేస్తే- ప్రేమ ప్రాణాలు తీసిందనీ రాసుకుంటూ పోతే, ఏమిటర్థం? అసలు విలన్‌ కులం కాదనీ, ప్రేమ అనీ తేల్చినట్టేగా? ఆ విధంగా రీడర్స్‌కి కొత్త జ్ఞానాన్ని పంచుతున్నట్టేగా !

-ఎస్.ఎస్.రావు, సీనియర్ జర్నలిస్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here