దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 9 లక్షల 40 వేల యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 80,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 62,25,763 కు చేరింది. వీరిలో ఇప్పటికే 51,87,826 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 86,428 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిన్న 10,86,688 కోవిడ్ నిర్థారణ పరీక్షలను నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 7 కోట్ల 41 లక్షల టెస్టులు పూర్తి చేసినట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది.
కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 1179 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మరణించినవారి సంఖ్య 97,497 కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితులు రికవరీ రేటు 83.33 శాతం కాగా, మరణాల రేటు 1.57 శాతంగా ఉంది. కరోనా తగ్గుముఖం పట్టిందని ప్రజలు బావిస్తే అది పొరపాటే అవుతుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలను మించిన రక్షణ మార్గం మరొకటి లేదు. ఈ విషయం మర్చిపోతే కోరి కరోనా వలలో చిక్కుకున్నట్టే.