ఎమ్మెల్సీ బరిలో కోదండరామ్! కారుకు కష్టాలు తప్పవా..?

0
37

టీజేఏసీ చైర్మెన్ గా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన కోదండరామ్.. అధికార టీఆర్ఎస్ తో పోరుకు సై అంటున్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేయాలని నిర్ణయించింది. కోదండరామే స్వయంగా బరిలో ఉంటారని తెలుస్తోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి పోటీ చేయాలని కోదండరామ్ దాదాపుగా నిర్ణయించుకున్నారని టీజేఎస్ నేతలు చెబుతున్నారు. కోదండరామ్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతుంది. కోదండరామ్ కు ఉమ్మడి వరంగల్, నల్గొండ , ఖమ్మం జిల్లాలోని ఉద్యోగ, విద్యార్థి వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. కాకతీయ యూనివర్శిటీతోనూ ఆయనకు అనుబంధం ఉంది.


వరంగల్ జిల్లాపై టీజేఎస్ ధీమా…
తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ వరంగల్ జిల్లాలో అనేకబ సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ జిల్లాకు చెందిన చెందిన ఉద్యోగులు, విద్యార్థులు ఆయన వెంట నడిచారు. వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ కు మద్దతుగా నిలుస్తారని టీజేఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలోనూ కోదండరామ్ కు చాలా మంది అనుచరులు ఉన్నారు. ఉద్యమాల గడ్డగా పిలిచే నల్గొండ జిల్లా నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కోదండరామ్ పోటీ చేస్తే మద్దతు ఇస్తామని ఖమ్మం జిల్లా నుంచి వినతులు వస్తున్నాయని సమాచారం. అన్ని అంశాలు పరిశీలించాకే ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని కోదండరామ్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. దాదాపుగా నిర్ణయం జరిగిపోయిందని అధికారికంగా ప్రకటించడమే మిగిలిందంటున్నారు. కోదండరామ్ కూడా ఇటీవల వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. కరోనా భయపెడుతున్నా ఆయన పలు సభల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులకు ఆయన సంఘీభావం తెలిపారు. నాలుగైదు ప్రాంతాలకు వెళ్లి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టే కోదండరామ్ నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించారని భావిస్తున్నారు.


మళ్లీ పల్లా అయితే పోటీ రసవత్తరం…
నల్గొండ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పల్లా సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలన్ని ఆయనకే అప్పగిస్తున్నారు కేసీఆర్. జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల నిర్మాణాలను పల్లానే పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వంలోనూ పల్లా హవా సాగుతోంది. దీంతో మళ్లీ ఆయన్నే పోటికి పెట్టవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఎన్నిక మరింత సవాల్ గా మారనుంది. పల్లా గెలుపును కేసీఆర్ ప్రెస్టీజీగా తీసుకునే అవకాశం ఉంది. కోదండరామ్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టింది టీజేఎస్. దీంతో కోదండరామ్ కు కాంగ్రెస్ మద్దతు ఈజీగానే లభించవచ్చు. కోదండరామ్ కోరితే బీజేపీ కూడా ఆయనకు మద్దతు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.


ఖమ్మంలో బీజేపీ..లెఫ్ట్ సపోర్ట్..?
ఖమ్మం జిల్లాలో బీజేపీ అంత బలంగా లేదు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా గెలుపు అవకాశాలు తక్కువే. కోదండరామ్ కు సపోర్ట్ చేస్తే ఉద్యమ నేతను బలపర్చినట్లు.. టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించే ఛాన్స్ వస్తుందని కమలం నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వామపక్ష సంఘాలతో కలిసే ఉద్యమాలు చేస్తున్నందున.. ఆ పార్టీల సపోర్ట్ కూడా కోదండరామ్ కు లభిస్తుందని చెబుతున్నారు.


సర్కార్ పై ఉద్యోగులు నిరుద్యోగులు గరం గరం..
సీఎం కేసీఆర్ పాలనా తీరుపై కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. నిరుద్యోగులు కూడా గరంగరంగా ఉన్నారు. ఈ వర్గాలన్ని కోదండరామ్ ను ఎమ్మెల్సీగా పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను ఓడించి ముఖ్యమంత్రికి షాక్ ఇవ్వాలని ఉద్యోగులు కసిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మండలి ఎన్నికల్లో ఉద్యోగులే ఎక్కువగా ఓటర్లుగా ఉన్నారు కాబట్టి.. వారంతా కోదండరామ్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి కోదండరామ్ పోటీ చేస్తే అధికార టీఆర్ఎస్ కు సవాలేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోదండరామ్ కు మిగిలిన విపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉండటంతో కారు కష్టాలు తప్పవని చెబుతున్నారు.

-ఎస్.ఎస్.యాదవ్,సీనియర్ జర్నలిస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here