విభిన్న కథాంశాలతో ఆసక్తి కలిగించే కథనాలతో ఆలోచింపచేసే చిత్రాలు రూపొందించటంలో మళయాళీ ఫిలిం మేకర్స్ సిద్ధహస్తులు. ఆ కోవకు చెందిన దర్శకుడే శిబి మలయిల్. ఆయన 1987లో రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం “తనియావర్తనం”. మమ్ముటి, సరిత, తిలకన్ ప్రథాన పాత్రధారులు. ఓ నాయర్ కుటుంబంలో మూఢనమ్మకం ఇందులోని కథావస్తువు. ఆ మూఢ నమ్మకం ఎలా ఎంతమంది జీవితాలను బలి తీసుకుందో సినిమా చూస్తున్నంతసేపూ మనల్ని కట్టిపడేస్తుంది.
బాలన్ ఒక చిన్న పల్లెటూరిలో బడి పంతులు . అద్బుతమైన ఆర్ట్ టిచర్. బాలన్ పాత్రను దర్శకులు ఎంత గొప్పగా మలిచారంటే సినిమా మూల కథకు అవసరం లేకపోయినా క్లాస్ రూమ్ లో పిల్లలకు జీవిత పాఠాలు చెప్పేటప్పుడు బాలన్ చెప్పే గాలిపటం పిల్లవాడి కథ కోసం సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనపిస్తుంది. అంతలా హత్తుకుపోతుంది ఆ సంభాషణ. సినిమాలో మమ్ముటి నటన హైలైట్ గా నిలుస్తుంది.
బాలన్ కుటుంబానికి తరతరాలుగా ఒక శాపం. వారి ఇంట్లో ఒక మగవ్యక్తి మతి భ్రమించి జీవిస్తాడు అని. ఇది అమ్మవారి శాపం అని కుటుంబం అందరూ నమ్ముతారు. ఎవరూ ఈ శాప విషయం మర్చిపోకుండా ప్రతీ ఏటా అమ్మవారికి జాతర చేయిస్తారు. దీనితో ఊరందరికి ఈ శాపం గురించి తెలుసు.
ప్రస్తుతం బాలన్ చిన్నాన మతి భ్రమించి ఉంటాడు. ఇతన్ని గొలుసుతో కట్టేసి పై గదిలో ఉంచుతారు. ప్రేమ విఫలం అయి అతను అలా అయ్యాడని. అతను మంచి గాయకుడు, సంగీతకారుడని బాలన్ అతని గురించి భార్య దగ్గర బాధపడతాడు. ఈ చిన్నాన్న చాలా వరకు మౌనంగా అందర్ని గమనిస్తూ స్వేచ్చ కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అతని అవస్థ గమనించి ఒక రోజు బాలన్ అతని గొలుసు విప్పేస్తాడు. అదే రోజు ఆయన కొలనులో పడి ఆత్మహత్య చెసుకుంటాడు. ఇక ఆయన తరువాత ఈ ఇంట్లో పిచ్చి ఎవరికి పడుతుంది అన్న సందేహం ప్రతి ఒకరిని వేధిస్తుంది. అది కుటుంబానికి తప్పని శాపం అని ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా నమ్ముతారు. బాలన్ చెల్లెలికి ఈ కుటుంబ చరిత్ర తెలిసి పెళ్ళి అవడం కష్టమవుతుంది. బాలన్ తమ్ముడు ఈ ఇళ్ళు పరిసరాలు వదిలితే తప్ప తమ కుటుంబం స్వేచ్చగా ఉండలేదని, ఈ మూఢనమ్మకం తో ఎవరో ఒకరిని బలవంతంగా ఈ ఇంటి
వాతావరణమే పిచ్చివాళ్ళగా మారుస్తుందని అతను బలంగా వాదిస్తాడు.
తాను కట్టు విప్పడమే చిన్నాన్న చనిపోవడానికి కారణమేమో అన్న భావన బాలన్ కు కలుగుతుంది. రాత్రి వేళ చిన్నాన్న తనను పిలుస్తున్నట్లు, తన కాలికి సంకెళ్లు బిగించినట్లు కల వస్తుంది. బెదిరి పోయిన బాలన్ ఇంట్లో వారికి తనకొచ్చిన కల గురించి చెపుతాడు. ఇక తరువాత మతి చలించేది అతనికే అని ఇంట్లో అందరూ నమ్ముతారు. అతన్ని కాపాడుతున్నాం అన్న తపనతో ఊర్లో, అతని మిత్రుల వద్ద అతన్ని గమనిస్తూ ఉండమని చెపుతారు. ప్రతి ఒక్కరికి బాలన్ లో మార్పు కనిపించడం మొదలవుతుంది. ఏ పాపం ఎరుగని బాలన్ ఊరివారి వింత ప్రవర్తన, క్లాసులో పిల్లల అనవసర భయాన్ని ఎదుర్కోలేక అలజడి చెందుతాడు. దాన్నే మతి భ్రమించడం అని ఇంట్లో ప్రతి ఒక్కరు నమ్ముతారు. అతన్ని సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకేళతారు. ఈ లోపే చెల్లెలి పెళ్ళి కుదరడం బాలన్ కు ఆ ఇంటికి సంబంధం లేదని ఇంట్లో వారు పెళ్లి వారితో చెప్పడం, బాలన్ లేకుండానే చెల్లి పెళ్ళి జరగడం, దీనితో బాలన్ మనసు దెబ్బతినడం జరుతుంది. అతని భార్యను బలవంతంగా పిల్లలతో సహా పుట్టింటికి వారు తీసుకెళతారు . భయంకరమైన వంటరితనంతో బాలన్ నిజంగానే పిచ్చివాడయిపోతాడు. భార్యా పిల్లలు వెళ్ళిపోవడం, వారు తిరిగి రాకపోవడం, అతి ప్రేమతో ఇంట్లో వారే తనను పిచ్చివాడిగా చేయడం, ఎవరికీ చెప్పలేని బాధతో మౌనంగా అన్నీ భరించే బాలన్ ను చూసి భరించలేక అతని తల్లే విషం పెట్టి చివర్లో చంపేయడం ప్రేక్షకులు మర్చిపోలేని ముగింపు.
మూఢనమ్మకాలు కుటుంబాలని ఎలా నాశనం చేస్తాయో, ప్రేమ పేరుతో కూడా మనిషులు ఒకరికొకరు ఎలా అన్యాయం చెసుకుంటారో, కుటుంబంలోని స్త్రీలు మగవారిపై ఆధారపడవల్సిన అవసరం, ఆ అధికారం క్రింద కుటుంబ భారాన్ని మోస్తున్న వ్యక్తులు చెసే తప్పిదాలు, ఇవన్నీ ఈ సినిమా చర్చిస్తుంది. సినిమాలో పాత్రలన్నీ చేసేవి తప్పిదాలే. ప్రతి ఒక్కరికీ బాలన్ పై ప్రేమ కాని అందరూ అతన్ని పిచ్చివానిగా తయారుచెసి అతని చావుకు కారణం అవుతారు. ఎవరూ చెడ్డవారు కాదు, కాని అందరూ బాలన్ నాశనానికి కారకులే. ఈ సినిమాలో బాలన్ పాత్రలో మమ్ముట్టి నటనను ఎప్పటికీ మరిచిపోలేము. ఆయనే కాదు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలలో జీవించారు.