దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమను కరోనా వెంటాడుతోంది. నిన్నటికి నిన్న తమిళనాట ఓ హాస్యనటుడు కరోనా బారిన పడి చనిపోయారు. నేపథ్యగాయకుడు ఎస్పీ. బాలసుబ్రమణ్యం కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నిన్నటికి నిన్న జయప్రకాశ్ రెడ్డి గుండె పోటుతో చనిపోయారు.
ఈ విషాదం మరవక ముందే ప్రముఖ నటుడు నటుడు కోసూరి వేణుగోపాల్ కన్నుమూశారు.గత నెలలో కరోనా వైరస్ బారినపడిన వేణుగోపాల్ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గుండెపోటు రావడంతో బుధవారం రాత్రి తుది శ్వాస తీసుకున్నారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వేణుగోపాల్ ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తరువాత నటనపై ఆసక్తితో సినీరంగం వైపు వచ్చారు. మర్యాద రామన్న, పిల్ల జమిందారు, ఛలో, అమీతుమీ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. వీటితో పాటు ఆయన తనదైన శైలిలో పలు టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు. వేణుగోపాల్ మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.