బాలీవుడ్ లో కలకలం రేపిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో విచారణ ప్రస్తుతం అతని ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టే తిరుగుతోంది. ఈ కేసులో సీబీఐ విచారణ వేగవంతమైంది. రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని గత మూడు రోజులుగా అధికారులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు రియా నుంచి సమాధానం రాబట్టారు. ఐతే మరో రెండు ముఖ్యమైన ప్రశ్నలకు మాత్రం రియా సమాధానం చెప్పలేదు.
మొత్తం 50 ప్రశ్నలు అడిగితే అందులో రెండింటికి మాత్రం ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. ఈ ఏడాది జూన్ 8న సుశాంత్‌తో విడిపోయిన అనంతరం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారా.. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనంతరం కూడా రియా సోదరుడికి సుశాంత్ ఫోన్ చేశాడా.. ఆత్మహత్య చేసుకునే ముందు సుశాంత్ గురించి వివరాలు తెలుసుకున్నారా? అన్న ప్రశ్నలకు రియా సరిగ్గా సమాధానం చెప్పట్లేదని తెలిసింది. ఆమె నుంచి మరిన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు రియాకు అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ కేసుకు సంబంధించి గోవాకు చెందిన హోటల్ యజమాని గౌరవ్ ఆర్యాని ఆదివారం ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని..తాను ఎప్పుడూ సుశాంత్ ని కలవలేదని, రియాని మాత్రం 2017లో ఒకసారి కలిసినట్టు ఈడీ అధికారులకు చెప్పినట్టు సమాచారం.