ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కార నేరం కింద అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్ 15వ తేదీ లోగా రూపాయి జరిమానా కట్టాలని, లేకుంటే మూడు నెలల జైలుశిక్ష, మూడేళ్ల పాటు న్యాయవాద వృత్తిపై నిషేధం ఉంటుందని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేను, సుప్రీంకోర్టును విమర్శిస్తూ ప్రశాంత్‌భూషణ్ ట్వీట్లు చేయడంతో ఆయనపై సుమోటాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కోర్టు కోరగా ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. తన వ్యాఖ్యలు అసలు కోర్టు ధిక్కరణ కిందకు రావని, తాను క్షమాపణ చెపితే నిజంగానే కోర్టు ధిక్కరణ చేసినట్లని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రశాంత్ భూషణ్ విషయంలో కోర్టు ఏం చేస్తుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసింది.