ఇంటింటా బాలు.. పాడుతా తీయగా!

0
72

పాడుతా తీయగా కార్యక్రమం మొదలైన దగ్గర నుంచీ మా కుటుంబం మొత్తం దానికి అభిమానులం. బాలుని కొత్త కోణంలో అర్ధం చేసుకోవడానికి ఉపయోగ పడ్డ కార్యక్రమం అది. రెహ్మాన్ రావడంతో కొత్త గాయకులను పరిచయం చేయడం, బాలుకి ఇంతకుముందు ఉన్న డిమాండ్ తగ్గిపోతున్న సమయం అది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెహ్మాన్ పాడించిన వాళ్ళని మిగిలిన సంగీత దర్శకులు కూడా తీసుకోవడం మొదలు పెట్టారు.

బాలుకి ఎక్కువ డబ్బు ఇవ్వాలనో లేక తమకంటే చాలా పెద్ద స్థాయి ఉన్న బాలుతో డీల్ చేయడం సౌకర్య వంతంగా ఉండదనో కానీ కొత్త సంగీత దర్శకులు బాలుతో ఎక్కువ పాడిం చలేదు. దానిగురించి ఆయన చేసిన ఫిర్యాదు కూడా ఏమీ లేదు. తెలుగు పదాల్ని నేర్చుకుని, అర్ధం తెలుసుకుని మాత్రమే పాడండి అని మాత్రమే చేప్పేవాడు. సిద్ శ్రీరాం “సామ జవరగమనా” పాట గానీ, ఇంకో కొత్త గాయకుడు “ప్రియతమా, నీవచట కుశలమా, నేనిచట కుశలమే” (ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో) పాటలో దొర్లిన బాషా దోషాలు ఎంత చేదు అనుభవాన్ని మిగిల్చాయో మనకి తెలుసు. సిద్ శ్రీరాం దానికో క్షమాపణ చెప్పాడు..అది వేరే విషయం.

అమితాబ్ బచ్చన్ కేబీసీ నిర్వహించడం, బాలు పాడుతా తీయగా నిర్వహించడం రెండూ నాకు ఎప్పుడూ ఆశ్చర్యాలే. వాళ్ళ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకున్న వారు ఇవి చేయడం. బాలు ఆ రంగంలో ఇంకా అడుగు పెట్టని వారికి శిక్షణ ఇచ్చి, ప్రోత్సహించి, గాయకులుగా తీర్చిదిద్దడం అనేది ఊహించడం కూడా జరగదు. మల్లికార్జున, గోపిక పూర్ణిమ, ఉష లాంటి వారు పాడుతా తీయగా లేకపోతే లేరు. ఆ కార్యక్రమం నిరాటంకంగా పాతికేళ్ళ పాటు నడవడం బాలు క్రమశిక్షణకు ఉదాహరణ.

ఎంతో మంది గాయకులు పరిచయం అవడం, పాత వాళ్ళ ప్రతిభ మరింత వెలగడం జరిగింది. ప్రతీ ఆదివారం సాయంత్రం స్వరాభిషేకం కార్యక్రమం కూడా బాలు ఆధ్వర్యంలోనే జరిగేది. వర్ధమాన గాయనీగాయకులకు ఒక వరప్రసాదం ఆ స్టేజి. ఈ విషయంలో రామోజీ రావు గారిని అభినందించకుండా ఉండలేం. ఎవరైనా ప్రముఖులు చనిపోతే తీరని లోటు అంటుంటే నా మనసు అంగీకరించేది కాదుగానీ, బాలు మరణించడం మొత్తం భారతీయ సినీ నేపధ్య సంగీతానికి తీరని లోటు. ఒక పెద్ద దిక్కుని కోల్పోయినట్టే. ఒక దిక్సూచి మాయం అయినట్టే. గంధర్వులు ఎంత బాగా పాడతారో తెలీదు గానీ ఎవరైనా గంధర్వుడు కనబడి బాగా పాడితే మాత్రం వాడొక బాలసుబ్రహ్మణ్యం రా అనచ్చు.
-బాలు అభిమాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here