మానసిక అనారోగ్యానికి మంచి మాటలే మంచి మందు..

0
41


పూర్తి ఆరోగ్యవంతులు ఎవరూ లేనట్టే పూర్తి సంతోషంతో బతికే మనుషులు కూడా ఎవరూ ఉండరు. కొందరు కాస్త ఎక్కువ సంతోషంగానో, ఎక్కువసేపు సంతోషంగానో ఉంటారు, లేదా ఉన్నట్టు కనపడతారు. లేదా అలా ఉండటానికి వదలకుండా జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
“Tuesdays with Morrie” లో డెబ్భై ఏడేళ్ల ప్రొఫెసర్ త్వరలో చనిపోతానని తెలిసి వీల్ చెయిర్లో కాలం గడిపే పరిస్థితిలో ఉంటాడు. అతని స్టూడెంట్ మిచ్ అడుగుతాడు “మీరు ఇలాంటి స్థితిలో కూడా ఎప్పుడూ సంతోషంగా ఎట్లా ఉంటున్నారు?” అని. దానికి ఆయన ఇలా అంటాడు “ఎప్పుడూ బాగున్నానని ఎవరన్నారు? తెల్లారుఝామున మెలకువొస్తుంది. మా ఆవిడ, హెల్పర్ అందరూ నిద్రలో ఉంటారు. మంచంలోనుంచి కదల్లేను. వాళ్ళు లేచేవరకూ చప్పుడు రాకుండా ఏడుస్తూ ఉంటాను. పగలు థెరఫీ, నన్ను చూడటానికొచ్చే విజటర్స్ వల్ల హుషారొస్తుంది. మళ్ళీ రాత్రికి మామూలే.” అని.


బాగుండటం, బాగైపోవడం అంటే అస్తమానం పిచ్చెక్కినట్టు నవ్వుతూ, ఇరవైనాలుగ్గంటలూ గంతులేస్తూ తిరగడం అనేది భ్రమ. రోజూ ఏడుగంటలు గాఢంగా నిద్రపోవడం కూడా ఇప్పుటి రోజుల్లో పెద్ద లగ్జరీ అనే అనుకోవాలి. రోజులో ఎంతోకొంత సమయం ప్రతి మనిషిని ఏదో ఒక దిగులు కబళిస్తుంది. ఒక్కో దశలో రోజంతా అదే ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా మాజికల్ గా ఒక పూటలో మారిపోదు. పోయినవారం రోజుకి మూడు గంటలు ఏడిస్తే ఈవారం దాన్ని రెండు గంటలకి తీసుకురాగలమా అని ఆలోచించాలి. ఒక గంటసేపు సినిమా చూడ్దమో, ఎవర్తోనైనా మాట్లడ్దమో వీలతుందా అని ప్రయత్నించాలి. అది కూడా కేవలం ప్రయత్నమే తప్ప వెంటనే రిజల్ట్ కనపడదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
అసలు అంత ఎఫర్ట్ పెట్టగలిగితే, అంత లాజికల్ గా ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకోగలిగితే అది మెంటల్ హెల్త్ ప్రాబ్లెం కాదని నాకు తెలుసు. శరీరానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు దానికి అవసరమైన ఆహారం సహించదు, మందు వేసుకోబుద్ధి కాదు, తగిన రెస్ట్ తీసుకోడానికి నొప్పి అడ్డుపడుతుంది. అట్లాగే డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు దాన్నించి బయట పడటానికి ఏం అవసరమో అవి చేసే శక్తి రాదు. జ్వరమొచ్చి తిండి సహించనప్పుడు “ఎట్లాగో ఈ కాస్తా తిని మందేసుకో” అని పక్కవాళ్ళు బతిమాలినట్టు “మా అమ్మవి కదూ, కాసేపు ఈ సినిమా చూద్దాం రా” అని డెప్రెషన్ లో ఉన్నవాళ్లకి ఆసరా ఇచ్చేంత అవగాహన ఇంకా మనకి లేదు. ఒకవేళ అలా మంచి మాటల్తో సపోర్ట్ చేసేవాళ్ళున్నా వాళ్లతో రూడ్ గా మాట్లాడటం, గ్రాంటెడ్ గా తీసుకోడం, కృతజ్ఞత లేకపోవడం, తిరిగి వాళ్లనే నిందించడం లాంటివి ఈ రోగ లక్షణాలు. అసలే బాగోకపోవడంతో పాటు, బాగుపరిచే మనుషుల్ని, సలహాల్ని, అవకాశాల్ని పక్కకి తొయ్యడం ఇంకా పెద్ద లాస్. అట్లా అనుకుని “నేనింతే, నా ఏడుపు, నా జీవితం ఇంతే.” అని వల్లించుకుంటే లాభం లేదు. రోజూ కడుపునొప్పొస్తుందని కొన్ని నెలలపాటు మనం ఎవరికైనా చెప్పి బాధ పడుతూ ఉన్నామనుకోండి. మన సంభాషణలో అస్తమానం ఆ కడుపునొప్పి గురించే చెప్తున్నాం అనుకోండి. వాళ్ళు వాము తినమనో, ఫలానా మందేసుకోమనో, ఫలానా తిండి తినద్దనో, డాక్టర్ ని కలవమనో చెప్తే వాటిల్లో కనీసం ఒక చిన్న ప్రయత్నం చెయ్యకుండా ఆ సలహాలన్నీ పెడచెవిన పెట్టి “నాకు కడుపునొప్పి జన్మకి తగ్గదు” అని రోజూ ఏడిస్తే అది ఎవరికీ మంచిది కాదు. బాగవ్వాలనుకునేవాళ్లు ఆ మాత్రం ప్రయత్నం చెయ్యక తప్పదు.
ఫామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి మెంటల్ హెల్త్ గురించి ఒక ప్రెజెంటేషన్ ఇస్తుంది. “మానసిక అనారోగ్యం కూడా కడుపునొప్పి లాంటిదే” అని. అది చెప్పేటప్పుడు ఆమె హావభావాలు బాడీ లాంగ్వేజ్ కాస్త అతిగా అనిపించింది నాకు. ఈమె ఏంటి ఇంత మాములు విషయాన్ని రాకెట్ సైన్స్ చెప్తున్నంత బిల్డప్ తో చెబుతుంది అని. కానీ, ఇప్పుడనిపిస్తుంది, మన మెదళ్లలోకి ఈ విషయం సింక్ అవ్వడం రాకెట్ సైన్స్ కంటే గొప్ప విషయం అని. తరతరాలుగా మనం దీన్నంతా రొమాంటిసైజ్ చెయ్యడానికి, గ్లామరస్ గా చూపించుకోడానికి, లోతైన మనుషులుగా కనపడ్దంకోసం మెలాంకలీ ని వాడుకోవడానికి అలవాటు పడిపోయాం. ఆ లగ్జరీని అంత తేలిగ్గా వదులుకోలేము. ఒంటరితనం గురించి కవిత రాస్తే ఉన్నంత గొప్పగా అజీర్తి గురించి రాస్తే ఉండదు కదా.


“నీకేం మంచి ఉద్యోగముంది, మంచి ఫ్రెండ్సున్నారు, నీ పార్ట్నర్ మంచి మనిషి, నీకు నా బాధ అర్థం కాదు” అని సాయం చెయ్యబోయినవాళ్లమీద నిష్టూరపడతాం మనసు బాగోనప్పుడు. మరీ సిల్వర్ స్పూన్ తోనో, గిఫ్టెడ్ టాలెంట్స్ తోనో పుడితే తప్ప మాములు మనుషులెవ్వరికి ఏదీ ఫ్రీ గా రాదు. ఒకవేళ లక్కీగా దొరికినా వాటిని నిలబెట్టుకోవడం అనుదిన ప్రయత్నం. ఇన్ని సంవత్సరాలు దగ్గర మనుషుల్ని నిలబెట్టుకోవడం అంటే వాళ్లని ఎన్నిటికో క్షమించి, వాళ్లకోసం ఎన్నో త్యాగం చేసి, సాయాలు చేసి. వాళ్ల తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని కించపరచకుండా గౌరవంగా మాట్లాడితేనే నిలుస్తాయి బంధాలు. అంత జాగ్రత్తగా ఉన్నా నిలవకపోవడం ఒక్కోసారి దురదృష్టమే కానీ, అసలు ఎంపతీ లేకుండా, ప్రయత్నం చెయ్యకుండా, దగ్గర వాళ్లని అనకూడనివి అని విసిగించి పోగొట్టుకుని “నాకు ఫ్రెండ్స్ లేరు, నీకున్నారు” అని ఒక నిందలాగా అని మనకి సాయం చేసేవాళ్ల మనసు గాయపరచడం తప్ప ఏం సాధించలేం. డబ్బైనా, ఉద్యోగమైనా, ఒక ఫీల్డ్ లో పేరు తెచ్చుకోవడమైనా జీవితమంతా ఎంతో శ్రమ పడితే కానీ దక్కదు. రాత్రంతా ఏదో సమస్యతో నిద్రలేకపోయినా పొద్దున టైం కి లేచి పనిచేసుకోవడం, వొళ్ళు, మనసు ఎంత బాగోపోయినా ఏ డెడ్లైన్ ని మిస్ అవకుండా ఏ బాధ్యతని తప్పించుకోకుండా పనిచెయ్యడం అంత తేలిక కాదు. ఇతరులకి ఆయాచితంగా అన్నీ వచ్చి పడ్డట్టు, అందుకే వాళ్ళు బాగున్నట్టు, మనం బాగోనట్టు నమ్మితే మనకే ప్రమాదం.
థెరపిస్ట్ లు, సైకాలజిస్ట్ లు వాళ్ల కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ప్రతి పదిహేను రోజులకో, నెలకో మరో ప్రొఫెషనల్ దగ్గరకు కౌన్సలింగ్ కి వెళ్లాలి. ఇతరుల బాధలన్నీ వింటూ ఉండటం వల్ల వాళ్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ తప్పనిసరి రూల్ ఉంది(నాకు తెలిసినంతవరకు). సైకాలజీ చదువుకుని, ట్రయినింగ్ తీసుకుని, ఎన్నో కేసులని రోజూ చూసే ప్రొఫెషనల్స్ సంగతే ఇలా ఉంటే. అసలు ఈ ఫీల్డ్ కి ఏ సంబంధం లేకుండా ఎవరి జీవితాల్లో వాళ్ళు స్ట్రగుల్ అయ్యే మాములు మనుషుల సంగతేంటి? ఏ క్వాలిఫికేషన్ లేకున్నా ఇంట్లో ఒక మనిషికో, ఫ్రెండ్ కో కేవలం ప్రేమ, సహనం తో వాళ్ల ట్రామా ని వింటూ, ఓదారుస్తూ, సలహాలిస్తూ, వీళ్ల మనసుల్లో వేరే బాధలు, భయాలు ట్రిగ్గర్ ఔతూ, వీళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తిని ఉన్నా, తింటున్నా కూడగట్టుకుని అవతలిమనిషిని దగ్గరకు తీసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత. “ఏం కాదులే అన్నీ సర్దుకుంటాయి.. ధైర్యంగా ఉండండి.. ఎవరకీ ఏదీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. మీ ఏకాంతాన్ని గౌరవిస్తాను.” అని చప్పటి మాటలతో దులుపుకునే సహాయం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. మోరీ మళ్లీ అంటాడు… “మీరు ఆమె ఏకాంతాన్ని గౌరవించటం లేదు..నిజానికి మీరు ఆమె ఫీలింగ్స్ ని నిరాకరిస్తున్నారు” అని.

నిజంగా ఎంపథైజ్ అయ్యి, ఆ బాధ తమదే అన్నట్టు నమ్మి, తమ అనుభవంలోంచి చూసి వివరాలు డిస్కస్ చేసి, పాయింట్ టూ పాయట్ స్పెసిఫిగ్గా గా వివరించి చెప్పి, ఈ మనిషి కాస్తైనా బాగుపడాలి అని పక్కనుండేవాళ్లు అరుదు. అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం, ఈ ప్రాసెస్ లో తమమీద ఎఫెక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఐనా అదంతా ఎవరైనా మనకోసం చేస్తుంటే ఆ ప్రేమని, శ్రమని, వాళ్లు తీసుకున్న రిస్క్ ని గౌరవిస్తే బాగుంటుంది. వాళ్ళ శక్తికి మించినప్పుడు కొంత ఊపిరి పీల్చుకోడానికి పక్కకెళ్తే నిందించకుండా ఉంటే బాగుంటుంది.
పిల్లలకి బయాలజీ పాఠాలతో పాటో, ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్పినట్టో టెక్స్ట్ బుక్స్ లో మెంటల్ హెల్త్ గురించిన కనీస అవగాహన కల్పించాలి. అట్లాగే ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్పినట్టు, సేఫ్టీ గురించి జాగ్రత్తలు చెప్పినట్టు వయసుకి తగ్గట్టు ఈ విషయాలు కూడా అర్థమయ్యేలా చేస్తే మంచిది. పెద్దవాళ్లం, మన దగ్గరి మనుషులు ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేవి తెలుసుకోవాలి. మనమే పేషెంట్స్ అనిపిస్తే సమస్యని ఒప్పుకుని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ మొహమాటం లేకుండా అడిగి ఆ హెల్ప్ కి విలువిచ్చి, సహాయానికి, ట్రీట్మెంట్ కి సహకరించి త్వరగా బాగవ్వడానికి ప్రయత్నించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here