రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను శివసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవి రైతు వ్యతిరేక బిల్లులని, రైతులను కార్పొరేట్ కంపెనీలు దోచుకోవడానికి వీలు కల్పించేలా ఆ బిల్లులు ఉన్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు.
ఈ బిల్లులు చట్టం రూపం దాల్చితే రైతుల ఆదాయం రెండింతలు అవుతుందా..? ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉంటాడా..? ఆ మేరకు మోదీ ప్రభుత్వం హామీ ఇస్తుందా..? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. పంటలకు కనీస మద్దతు ధర విధానాన్ని కొనసాగిస్తామని ప్రధాని మోదీ చెబుతున్నా..
అది కేవలం పుకారు మాత్రమేనని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధరపై ప్రధాని చెబుతున్నది అబద్దం కాబట్టే కదా హర్సిమ్రత్ కౌర్ మంత్రి పదవికి రాజీనామా చేశారు అని రౌత్ విమర్శించారు. ఈ బిల్లులపై హడావిడిగా చట్టాలు చేయడం కరెక్టు కాదని, ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లులపై సమగ్ర చర్చ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు.