రాజస్థాన్ రాయల్స్ షార్జాలో బోణీ కొట్టింది. సంజు సామ్సన్, స్టీవెన్ స్మిత్, జోఫ్రా ఆర్చర్ సిక్సర్ల వర్షం కురిపించి రాయల్స్ కు రాయల్ విక్టరీ అందించారు. ఈ ముగ్గురు కలిసి 17 సిక్సర్లు బాది చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించారు.
తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సునాయస విజయాన్ని అందుకుని ఉత్సాహంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ పరాజయంతో భారీ షాక్ తగిలింది. ఉత్కంఠభరింతంగా సాగిన ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా యశశ్వి జైశ్వాల్, స్టీవ్ స్మిత్ దిగారు.
ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 19 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జడేజా వేసిన ఏడో ఓవర్లో శాంసన్ రెండు సిక్సులు.. చావ్లా వేసిన ఎనిమిదో ఓవర్లో నాలుగు సిక్స్‌లు బాది బౌలర్లకు చుక్కలు చూపించాడు. చావ్లా వేసిన పదో ఓవర్లో స్మిత్ రెండు సిక్సు లు, ఒక ఫోర్ బాదడంతో ఆ ఓవర్లో 19 పరుగులతో పాటు అర్థశతకాన్ని నమోదు చేసుకున్నాడు. అప్పటికి స్మిత్ 36 బంతులాడి 51 పరుగులతో ఉన్నాడు. జడేజా వేసిన 12వ ఓవర్ మూడో బంతిని శాంసన్ సిక్స్ బాదాడు. జడేజా వేసిన 14వ ఓవర్లో స్మిత్ ఓ సిక్స్ బాదాడు.
చివరకు శాంసన్ 74 పరుగులు, స్మిత్ 69 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక చివరి ఓవర్లో ఆర్చర్ చెలరేగిపోయాడు. లుంగి ఎంగడి బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ వరుసగా 6, 6, 6, 6, బాదాడు. ఆర్చర్ కేవలం ఎనిమిది బంతులకు 27 పరుగులు తీశాడు. అందులో నాలుగు సిక్సులు ఉన్నాయి. 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ స్కోరు 216/6గా నమోదైంది. ప్రత్యర్థి జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు 217 భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
రాజస్తాన్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు ఓపెనర్లుగా మరళీ విజయ్, షేన్ వాట్సన్ బరిలోకి దిగారు. వాట్సన్ 33 (21) , మరళీ విజయ్ 21 (21) చేశారు. తరువాత వచ్చిన శామ్ కరన్ ఆరు బంతుల్లో 17 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ పరుగులేమీ చేయకుండా అవుటయ్యారు. 14వ ఓవ ర్ లో కుర్రన్ కేదార్ జాదవ్ 22 (16)ను వికెట్ తీశాడు. డుప్లెసిస్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 55(29) అర్ధసెచరీ పూర్తి చేసుకున్నాడు. కుర్రన్ వేసిన 18వ ఓవర్లో పది పరుగులు మాత్రమే వచ్చాయి.
ఆర్చర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని సిక్స్ కొట్టిన డుప్లెసిస్ ఐదో బంతిని భారీ షాట్ కొట్టి శాంసన్ చేతికి చిక్కి ఔటయ్యాడు. చివరి ఓవర్లో ధోనీ మూడు సిక్స్‌లు కొట్టడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు 200/6 ముగిసింది. 16 పరుగుల స్వల్ప తేడాతో చెన్నై ఓటమి పాలైంది.