విశ్వనగరమా..విషాద నగరమా?

0
81

హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తాం.. విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం.. ఎవరూ ఊహించని రీతిలో సుందరంగా తయారు చేస్తాం. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 ఫిబ్రవరిలో చెప్పిన మాటలు. అంటే కేసీఆర్ ఈ మాటలు చెప్పి ఐదున్నర ఏండ్లు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ను ఎంతో అభివృద్ధి చేస్తామని చెబుతుంటారు కేసీఆర్. అసెంబ్లీలో గ్రేటర్ పై జరిగిన చర్చలోనూ సీఎం ఇదే మాట చెప్పారు.

ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి చెప్పిరు . అయితే అసత్యాలు ఎక్కువ సమయం దాగవంటారు. హైదరాబాద్ లోనూ అదే జరిగింది. కేసీఆర్ మాాటలతో కోపంతోనే ఏమో ప్రకృతి కూడా వెంటనే స్పందించింది. భారీ వర్షం రూపం లో తెలంగాణ సీఎంకు సవాల్ విసిరింది. ఇంకేం కేసీఆర్ చెప్పిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ ఎంటో.. ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.

వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రోడ్లన్నీ వరదకాలువలను తలపించాయి.డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కార్లు, ఆటోలు నీళ్లలో ఉండిపోయాయి. ద్విచక్రవాహనాలు నీటి ఉధృతిలో కొట్టుకు పోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మోకాలిలోతుకు పైగా నీరు నిలవడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు అదుపుతప్పి కిందపడ్డారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు బస్తీల్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పురాతన భవనాల గోడలు కూలాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి.

ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ప్రయత్నించినా భారీ వరదనీటితో చేసేది లేక చేతులె త్తేశారు.రాజధానిలో ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు నిండాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు సైతం కుంగిపోయాయి. రహదారులన్ని చెరువులుగా మారడంతో నగరవాసులను నరకం చూశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సకాలంలో అత్యవసర బృందాలు రంగంలోకి దిగకపోవడంతో చాలా ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

కరోనా భయంతో వంతెనలు, చెట్లు, షాపుల ముందు నిలబడేందుకూ చాలా మంది భయపడి వర్షం, వరదలోనే నిల్చుని నరకం అనుభవించారు. తలదాచుకున్న ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేకపోవడంతో భయంతో బిక్కుబిక్కుమన్నారు. హైదరాబాద్ లో మొన్న కురిసింది 10 సెంటిమీటర్ల వర్షం. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. సిటీలో సరాసరి వర్షపాతం ఐదు సెంటిమీటర్ల కంటే తక్కువగానే ఉంది. అయినా హైదరాబాదీలు నరకం చూశారు. నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్ల వెంట నీళ్ల వెళ్లడానికే ఏర్పాట్లు లేకపోవడంతో ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. డ్రైనేజీలను పట్టించుకునే వారే లేకపోవడంతో అవన్ని వరదతో పొంగి ప్రవహించాయి.

వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలేవి బల్దియా తీసుకోకపోవడంతో సిటీ జనాలకు శాపంగా మారింది. రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమయ్యాయి. కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే హైదరా బాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఊహించుకోవచ్చు. ముంబైలో 24 గంటల్లోనే ఒక్కోసారి 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షం పడుతుంది. అలాంటి వర్షమే హైదరాబాద్ లో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిం చుకోవడానికే భయంగా ఉంది. ఐదు సెంటిమీటర్ల సరాసరి వర్షానికే నగరం అల్లాడిపోతే.. 30 సెంటిమీటర్ల వర్షానికి నగరం ఏమైపోతుందోనన్న ఆందోళనలో సిటీ వాసుల్లో వ్యక్తమవుతోంది. ఆరేండ్లలో 25 వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

వరద నీరు పోయే నాలాలు విస్తరించలేదు, కొత్త కాల్వలకు గతి లేదు.. రోడ్లన్ని గుంతలుగానే ఉన్నాయి. మరి 25 వేల కోట్లతో ఏం చేశారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. డల్లాస్ చేయడం కాదు ముందు వరద నీరు పోయే మార్గాలు చూడాలని సీఎం కేసీఆర్ పై ఫైరవుతున్నారు ప్రజలు.

మాములు రోజుల్లోనే హైదరాబాద్ రోడ్లపై గుంతలు ఉంటాయి. ఇది వర్షాకాలం. ఈ సీజన్ లో మంచి వర్షాలే పడ్డాయి. దీంతో సిటీలోని రోడ్లన్ని అధ్వాన్నంగా తయారయ్యాయి. గల్లీ రోడ్లతో పాటు ప్రధాన రహదారులు గుంతలతోనే నిండిపోయాయి. ఇప్పుడు గుంతల రోడ్లను వరద ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇంకిపోయాయి. ఇకేం ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు వణికిపో యారు. కొందరైతే ముందుకు వెళ్లడానికి భయపడి వర్షంలోనే నిలబడిపోయారు. హైదరాబాద్‌ రోడ్లపై గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. ఆ సమయంలోనే ప్రభుత్వంపై ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ లో రోడ్లపై అన్ని గుంతలే ఉండటంతో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఆటాడుకున్నారు నెటిజన్లు. గుంత రోడ్ల ఫోటోలు పెడుతూ కేసీఆర్, కేటీఆర్ ను నిలదీశారు. ఎవరైనా గుంతలు లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని కొందరు కొౌంటరిచ్చారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. .రోడ్లపై అన్ని గుంతలే ఉండటంతో నెటిజన్ల ప్రశ్నలకు జవాబు చెప్పలేక సైలెంట్ అయిపోయారు .హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా యి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని మండిపడుతున్నాయి. విశ్వనగరం చేస్తామంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నాయి. డల్లాస్ చేస్తామంటూ సిటిని ఖల్లాస్ చేశారని ఫైరవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉట్టి మాటలు కట్టిపెట్టి గ్రేటర్ పై ఫోకస్ చేయాలని సిటీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే చాలని, లండన్, డల్లాస్ సిటీ తరహా సౌకర్యాలు తమకు అవసరం లేదని చెబుతున్నారు.
-S.S.Yadav,Senior Journalist

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here