ఇదో అరుదైన చిత్రం.. ఇందులో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు గొప్ప వ్యక్తులే కాదు గొప్ప స్నేహితులు కూడా ..వారిలో మొదటి వ్యక్తి స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహరావు, మధ్యలో ఉన్నది ప్రజా కవి కాళోజీ నారాయణ రావు , చివరి వ్యక్తి ప్రముఖ మేధావి పాములపర్తి సదాశివరావు. ఈ ముగ్గురూ మన మధ్య లేరు. 1975లో పీవీ నరసింహ రావు వరంగల్ వెళ్లినప్పుడు స్థానిక రవి వర్మ ఫొటో స్టూడియో వారు ఈ ఫోటో తీసారు. (గూగుల్ సోర్స్ )
పీవీ, కాళోజీ గురించి , వారి స్నేహం గురించి తెలంగాణ ప్రజలందరికి తెలుసు. స్కూలులో చదువుకునేప్పుడు పీవీకి కాళోజీ సీనియర్. అక్కడ వికసించిన వారి స్నేహం జీవితాంతం కొనసాగింది. రాజకీయాల్లో ఇద్దరి దారులు వేరైనా.. ఎంత బిజీ గా ఉన్నా వారు స్నేహాన్ని మరవలేదు. వీలు దొరికనప్పుడల్లా కలుసుకునేవారు మనసు విప్పి మాట్లాడుకునేవారు.
ఇక వీరిద్దరికి ఆప్తమిత్రుడు పి.సదాశివరావు. పి.వి.నరసింహారావు ఇతనికి సోదరుడి వరుస, బాల్యమిత్రుడు. వీరి స్నేహం వికసించి కాకతీయ పత్రిక ప్రారంభించడానికి కారణమైంది. 1948లో ఈ కాకతీయ పత్రిక ప్రారంభమైంది. పాములపర్తి సదాశివరావు ఈ వారపత్రికకు సంపాదకుడు కాగా పి.వి.నరసింహారావు ఈ పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఈ పత్రికలో జయ-విజయ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. అవి పాఠకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
ఇద్దరూ అనేక కలంపేర్లతో ఈ పత్రికలో చాలా రచనలు చేశారు. సందేశమ్ పత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు 1945లో కాకతీయ కళాసమితిని స్థాపించాడు. ఈ సంస్థ కళలు, సాహిత్యం, నాటకాలు, శాస్త్రీయ సంగీతం మొదలైన వాటిని ప్రోత్సహించింది. ఈయన రచయితగా ఉంటూనే వివిధరంగాల ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రని పోషించాడు. రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు. ఆజాంజాహి కార్మికుల ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. 1996, ఆగస్టు 26న 76 ఏళ్ల వయస్పులో కేన్సర్ తో మరణించారు. సదాశివరావు జ్ఞాపకార్థం కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతియేటా ఈయన పేరిట ఒక ప్రముఖవ్యక్తిచే స్మారకోపన్యాసం ఇప్పిస్తుంది.