ఇమ్రాన్ ఖాన్ ని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి..

0
66

క్రికెటర్ గా ఇమ్రాన్ ఖాన్ కి పాకిస్తాన్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆడ మగ ..చిన్నా పెద్దా తేడా లేకుండా జనం పిచ్చిగా అభిమానించేవారు ఆయన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో ఆయన నేషనల్ హీరో. పాకిస్తాన్ కు1992 లో వరల్డ్ కప్ అందించి క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత కొంత కాలం సేవా కార్యక్రమాలు..తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. 1996లో పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ని స్థాపించారు. మొదట్లో ఇది ఒక సామాజిక రాజకీయ ఉద్యమంగా ప్రారంభమైంది.

పిటిఐ వెంటనే ఆదరణ పొందలేదు కానీ నెమ్మదిగా పెరగడం మొదలైంది. 1997లో నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ 242 సీట్లకు పోటీ చేసింది. కానీ ఒక్క సీటూ గెలవలేదు. ఇమ్రాన్ సహా (నాకు తెలిసినంత వరకు) పోటీ చేసిన అందరూ ఓడిపోయారు. కనీసం రెండు శాతం ఓట్లు కూడా ఆయన పార్టీ సాధించలేకపోయింది. అయినా ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల నుంచి తప్పుకోలేదు. ప్రభుత్వాల మీద ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చారు. 2002 ఎన్నికల్లో తిరిగి పోటీ చేశారు. ఈ సారి ఒక్క ఇమ్రాన్ ఖాన్ మాత్రమే గెలిచి పార్లమెంటు సభ్యుడయ్యారు.

2007 లో బెనజీర్ భుట్టో హత్యకు గురైన తరువాత నవాజ్ షరీఫ్ సౌదీ అరేబియాలో స్వీయ ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తరువాత దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు ముషారఫ్ పై ఒత్తిడి పెరిగింది. పిటిఐ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగస్వామి అయింది. సైనిక పాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. 2008 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పిపిపి విజయం సాధించింది. ఈ ఎన్నికను పిటిఐ బహిష్కరించింది. అప్పటి నుంచి ప్రభుత్వ అవినీతిపై ఉద్యమం తీవ్రతరం చేసింది. పార్టీ సభ్యత్వం పెరిగింది. పాకిస్తాన్ మొత్తం రాజకీయ క్రమాన్ని తీవ్రంగా విమర్శించాడు. పిపిపి అవినీతి అసమర్ధ పాలనను తీవ్రంగా ఎండగట్టాడు. తద్వారా ఖాన్ దేశం వ్యాప్తంగా అట్టడుగు ప్రచారాన్ని ప్రారంభించి పార్టీపై అవగాహన కల్పించాడు. ఫలితంగా 2013 ఎన్నికల్లో పీటీఐ 35 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఓ ప్రావిన్స్ లో అధికారంలోకి వచ్చింది. మరో ప్రావిన్స్ లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక 2018 ఎన్నికల్లో పీటీఐ 149 సీట్లు గెలిచి జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యారు. ఇదంతా జరగటానికి ఆయనకు 20 ఏళ్లకు పైనే పట్టింది.

రాజకీయాల్లో రాత్రికి రాత్రి లక్ష్య సిద్ధి జరగదు అనటానికి ఇదో ఉదాహరణ. ముఖ్యంగా ఓపిక సహనం చాలా అవసరం. నిరంతరం జనంలో ఉండాలి. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితాన్ని చూస్తే మనకు ఇదే అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్నాల్పి వస్తుందంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పవన్ కల్యాణ్ జనసేన పార్టీకు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. తేడా అల్లా అది జాతీయ పార్టీ ఇది ప్రాంతీయ పార్లీ. జన సేన కూడా పార్టీగా ఆవిర్భవించక ముందు ప్రజా ఉద్యమమే. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ వచ్చింది. సమస్యలపై ఘాటుగా స్పందిస్తూ జనాన్ని చైతన్య పరచే ప్రయత్నం చేసింది. 2014కు ముందు అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ప్రధాన నినాదంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజకీయాల్లో నిలకడ లేమి, అవకాశవాదం, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం వంటి వాటిని విమర్శించారు. 2014లో జనసేన ఒక రాజకీయ పార్టీ గా అవతరిచింది. తరువాత కొంత కాలం మౌనంగా ఉన్నా..తరువాత గొంతెత్తటం ప్రారంభించింది. సమస్యలపై చురుకుగా స్పందించింది.

బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన. విద్య, వైద్యం మెరుగుపరచడం. చట్టాల అమలులో అందరికీ సమన్యాయం. ప్రజాధనం వ్యయానికి కాపలా. జాతీయ సమైక్యత. ఇలాంటి వాటిని జనసేన పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. మోడీ సర్కార్ పై జనసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో ఈ విషయమై జనసేన బహిరంగ సభలను నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం పోరాడారు. ఆయన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చేయగలిగారు. ఇక ఎన్నికల విషయానికొస్తే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఇమ్రాన్ ఖాన్ లాగే ఓడిపోయారు. ఆయన ఓడిపోయినా జనసేన పార్టీ ఒక్క సీటు మాత్రం గెలిచింది.

ఘోర పరాజయం ఎదురైనా పవన్ కల్యాన్ రాజకీయాల నుంచి తప్పు కోలేదు..సందర్భానుసారం సమస్యలపై తన పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే నిరంతర ప్రజల మధ్య ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉండాలి. ఎక్కడో కూర్చుని స్టేట్ మెంట్లకు పరిమితమైతే ప్రయోజనం ఉండదు. పోరాడితే పోయేదేమీ లేదు..అధికారం వస్తుంది తప్ప అని గుర్తుంచుకోవాలి. ఇమ్రాన్ కు 20 ఏళ్లు పట్టింది.. పవన్ పార్టీ కి కేవలం ఆరేళ్లు మాత్రమే. ఆయనకు ఇంకా చాలా సమయం ఉంది. అధికారం ఏముంది..రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి.. ఎవరెన్ని మాట్లాడినా..ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా నిరంతరం జనమధ్యన ఉండాలి..పోరాటాలకు మరో పేరుగా నిలవాలి. వచ్చే ఎన్నికల నాటికైనా జన సైనికులను ఆ దిశగా సిద్ధం చేస్తారా? పవన్ కల్యాణ్ చేయగలరా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here