కాళేశ్వరం పంపులు బంద్.. విపక్షాలకు వరం.. డిఫెన్స్ లో గులాబీ దళం

3
306

టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విపక్షాలకు అస్త్రంగా మారుతోంది. రెండో ఏడాది కూడా ఎత్తిపోతల పంపులు ఎక్కువ రోజులు ఆన్ కాలేదు. అంతేకాదు ఎత్తిపోసిన కొద్ది పాటు నీరు కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో తిరిగి సముద్రం పాలైంది. దీంతో కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా వాయిస్ పెంచాయి విపక్షాలు. కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అనుకూలంగా మలుచుకుంటూ జనంలోకి వెళుతున్నాయి. తాము ముందు నుంచి చెబుతున్నట్లే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదని తేలిందంటున్నారు విపక్ష నేతలు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నా లక్ష కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్ట్  పంపులు ఆన్ చేయడం లేదని, ప్రాజెక్టు నిరుపయోగంగా పడి ఉన్నాయని చెబుతున్నారు. ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులు కట్టడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ వైట్ ఎలిఫెంట్ గా మారిందని  ఆరోపిస్తున్నారు.  ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు, ఎత్తిపోతలకయ్యే వందల కోట్ల రూపాయల కరెంట్ ఖర్చు వృధా అవుతున్నాయనే వాదనను  ప్రజల్లోకి తీసుకెళుతున్నారు

 ఆసియాలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రికార్డ్ సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి వివాదాలున్నాయి. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని టీఆర్ఎస్ చెబు తుం డగా.. కాళేశ్వరంతో ఉపయోగం లేదని, అవసరం లేకున్నా కమీషన్ల కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజలపై భారం మోపారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివాదాలు సాగు తుండగానే ప్రాజెక్ట్ ను గత ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌21న సీఎం కేసీఆర్‌ కన్నెపల్లిలో మోటార్లను స్టార్ట్ ‌‌ చేసి నీటి పంపింగ్‌ ‌‌‌‌‌‌‌ప్రారంభించారు.  అప్పుడు ప్రాణహితలో వరద లేకపోవడంతో గంట సేపటికే బంద్‌ చేశారు. ఆ తర్వాత జులై 6 నుంచి 29 వ‍రకు 5 మోటార్లను నిరంతరాయంగా నడిపించి 11.88 టీఎంసీలను అన్నారం బ్యారేజీలోకి పంపింగ్‌‌‌‌‌‌‌‌చేశారు. తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తారు. దీంతో ఎత్తిపోసి నీరంతా సముద్రం పాలైంది. అప్పుడు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.విపక్షాల ఆరోపణలపై  స్పందించిన సర్కార్..  ప్రాజెక్ట్ ఇంకా మొత్తం పూర్తి కాలేదని, వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో గోదావరి నీటిని ఎత్తిపోస్తామని ప్రకటించింది.  జూన్ చివరలో ఎత్తిపోతల ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ కూడా చెప్పారు.

                         సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ఈసారి కూడా జరగలేదు. రెండో ఏడాదిలో ప్రస్తుతం వర్షాకాల సీజన్ మొదలై.. రెండు నెలలు ముగుస్తున్నా ఎత్తిపోతల మాత్రం కొన్ని రోజులే సాగింది. జూలైలోనే గోదావరిలో వరద వచ్చినా కాళేశ్వరం పంపులు ఆన్ కాలేదు. ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి దాదాాపు 10 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి మిడ్ మానేరుకు తరలించారు. ఇంతలోనే భారీ వర్షాలు , వరదలు రావడంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చింది. ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములు నిండిపోయాయి. వరదలతో కాళేశ్వరం పంపులన్ని బంద్ చేశారు. అంతేకాదు మేడిగడ్డ నుంచి సుందిళ్ల, ఎల్లంపల్లికి ఎత్తిపోసిన నీరు కూడా.. ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో మేడిగడ్డ మీదుగా తిరిగి సముద్రం పాలైంది. మిడ్ మానేరు, ఎల్ఎండీ గేట్లు కూడా ఎత్తడంతో ఎత్తిపోసిన నీరంతా కిందకు వెళ్లింది.  10 రోజుల్లోనే ఎత్తిపోతలకు 20 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందని, ఆ నీటిని తిరిగి వదిలేయడంతో ఆ డబ్బంతా నీటిలో  కొట్టుకుపోయిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

                     కాళేశ్వరం ద్వారా ఏటా 225 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి ఏడాది ఎత్తిపోతల మాములుగానే సాగింది. అప్పటికి అనంతగిరి, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లు పూర్తి కాలేదు. దీంతో మిడ్ మానేరు వరకే లిఫ్టింగ్ చేశారు.
ఈ సంవత్సరం కూడాా ఆగస్టు వరకు పంపులు ఆన్ చేయలేదు. ఇదే అంశంపై ఇప్పుడు విపక్షాలు కేసీఆర్
సర్కార్ టార్గెట్ గా వాయిస్ పెంచాయి.  లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టి.. పంపులను ఆన్ చేయడం లేదని, ప్రణాళిక లేకుండా కట్టడం వల్లే ప్రజాధనం వృధా అవుతుందని మండి పడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు పంప్ హౌజ్ లు ఆన్ చేయాల్సిన అవసరం ఉండని ముందు నుంచే చెబుతున్నామని , వరదలు లేని సమయంలోనే ఎత్తిపోతల చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, ఎల్ ఎండీని పూర్తిగా నింపడంతో ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. అనంతగిరి, రంగనాయక సాగర్, కొండ పొచమ్మ సాగర్ తో మెదక్ జిల్లాలోనూ నీటి సమస్య తీరిందంటున్నారు.

-ఎస్.ఎస్.యాదవ్, సీనియర్ జర్నలిస్ట్

3 COMMENTS

  1. Have you ever heard of second life (sl for short). It is basically a game where you can do anything you want. SL is literally my second life (pun intended lol). If you want to see more you can see these sl articles and blogs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here