వ్యవసాయ బిల్లు పెద్దల సభలో దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ వెల్ చుట్టుముట్టి బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో రాజ్యసభ కొద్ది సేపు వాయిదా పడింది. తరువాత సెషన్ తిరిగి ప్రారంభమై ప్రస్తుతం సభాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అంతకు ముందు బిల్లులపై ఓటింగ్ సందర్భంగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఆదివారం రాజ్యసభకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ జరుగుతోంది.
రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. దీనిలో భాగంగానే డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఒబెరాయ్ బిల్లు ముసాయిదా ప్రతులు చింపేశారు. మైక్‌లను సైతం విరిగగొట్టారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోలానికి దారితీసింది. దీంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.