మళ్లీ ఉల్లి లొల్లి..

0
92

వంటింట్లో ఉల్లిదే అగ్ర స్థానం. ఏ కూర వండినా ఉల్లి గడ్డ తెగాల్సింది. ఉల్లిని తరిగేప్పుడు కంట్లో నుంచి నీళ్లు వస్తాయి. ఇక ఇప్పుడు తరగక ముందే సామాన్యుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఉల్లి ధర మరింత వడివడిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉల్లి పండించే పొరుగు రాష్ట్రాలలో వరదలు, భారీ వర్షాల మూలంగా సరఫరా తగ్గిపోయింది. తెలంగాణలోని గద్వాల్, మేడ్చల్ , శంషాబాద్ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కి ఉల్లిపాయలు ఎక్కువగా దిగుమతవుతాయి.


కిలో రూ.50 కి చేరే అవకాశం…
గత వారం హోల్‌సెల్‌ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ. 8 నుంచి 12 వరకు ధర పలుకగా .. ప్రస్తుతం కిలో రూ. 22 నుంచి రూ. 32 వరకు పలుకుతోంది. సోమవారం నుంచి ఉల్లి నగరంలోని బోయిన్‌పల్లి, గుడి మల్కాపూర్, మలక్‌పేట్‌కు కర్నూలు, కర్ణాటకతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి లోకల్‌ ఉల్లి దిగుమతులు తగ్గాయి. దీంతో ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా, కొన్ని రాష్ట్రాల్లో ఉల్లి పంటలు నాశనమయ్యాయి. ప్రస్తుతానికి , తెలంగాణలో ఉల్లి ధర భారీగా పెరగలేదు కానీ వర్షాలు కొనసాగితే, రాబోయే వారాల్లో ధరలు కిలో 50 రూపాయలకు చేరుతుంది.


తగ్గిన దిగుమతులు
సాధారణంగా హైదరాబాద్ నగర ఉల్లి అవసరాల్లో దాదాపు 60 శాతం మే మహారాష్ట్ర దిగుమతులే తీరుస్తాయి. పూణె, నాసిక్‌తోపాటు షోలాపూర్‌ తదితర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు రోజూ దాదాపు 60 లారీల ఉల్లి దిగుమతి అవుతుంది. మిగతా 40 శాతం కర్ణాటక, కర్నూలుతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి వస్తుంది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో చేతికి అందిన ఉల్లి నోటికి చేరలేదు. దాని ప్రభావం నగర మార్కెట్‌పై పడింది. రోజు మలక్‌పేట్‌ మార్కెట్‌కు 60 నుంచి 70 లారీల ఉల్లి దిగుమతి అయ్యేది. వర్షాలతో 30 నుంచి 35 లారీల ఉల్లి మాత్రమే దిగుమతి అవుతోంది.


పెరిగిన వినియోగం..
గతంతో పోలిస్తే నగరంలో ఉల్లి వినియోగం పెరిగింది. లాక్‌డౌన్‌ అనంతరం ప్రతి నెల ఉల్లి వినియోగం పెరుగుతూ వస్తోంది. స్థానికంగా ఉల్లితో పాటు మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి ఉల్లి దిగుమతులు మార్కెట్‌కు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధరలు తక్కువగా ఉన్నాయి. కమీషన్‌ ఏజెంట్లు, హోల్‌సెల్‌ వ్యాపారులు ఉల్లిని నిల్వ చేయడం, లేదా కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తప్పవు. ఉల్లి ధరలు నియంత్రించడానికి ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here