పోలికలు కలుస్తున్నాయ్..

0
145

కప్పుడు, రష్యాలో వాన పడితే – బెజవాడలో గొడుగు పడతారని సామెత. ఆ జమానా పూరా బదల్‌గయా. ఇప్పుడు రష్యా ప్రస్తావన వస్తే తెలుగువాళ్లకి పవన్‌ కల్యాణే గుర్తుకొస్తున్నాడు. అక్కడ కరోనాకి వ్యాక్సిన్‌ కనిపెట్టారనగానే, అత్తగారి దేశం కాబట్టి పవర్‌స్టార్‌కి దాన్ని తెచ్చుకోవటం ఈజీ అని సోషల్‌మీడియాలో జోకులు, కామెంట్లు !

పవన్‌కి రష్యాతో చుట్టరికం మాత్రమే ఉంది, కానీ దేశంలో చాలా మందికి – ఎక్కువగా ఉత్తర భారతీయులకి డిఎన్‌ఏ బంధమే ఉంది. రష్యాతో పాటు, మధ్య ఆ సియా దేశాల నుంచి ఎన్నో వందల తరాల కిందట, వారి ఫోర్‌ ఫోర్‌ ఫోర్‌ ఫోర్‌ ఫోర్‌ ఫాదర్స్‌ వలస వచ్చారన్నమాట. ఈ సంగతిని తాజా జన్యు పరిశోధనలు మరింత గట్టిగా రుజువు చేస్తున్నాయి. ఎక్కడో కాదు,మన హైదరాబాద్‌లోని సీసీఎంబీలో కూడా రీసెర్చి జరిగింది. ఈ సబ్జెక్ట్‌పై ఆ మధ్య పెద్దలు కల్లూరి భాస్కరం గారు ఓ మంచి వ్యాసం రాసినట్టు గుర్తు.వందల వేల సంవత్సరాల పాటు ఆ వలసలేమిటో ..ఇరాన్‌ నుంచి బెలూచిస్తాన్‌ వరకూ ద్రావిడ భాష ఉనికిలో ఉండటం ఏమిటో. సింధునాగరికత వైభవం ఒక్కసారిగా అంతరించిపోవటమేమిటో..మెదక్‌ జిల్లా మర్కుక్‌ నుంచి ఇరాక్‌లోని కిర్కుక్‌ వరకూ ప్రాచీన సమాధులన్నీఒకే రకంగా నిర్మాణమై ఉండటమేమిటో…మొత్తం మీద చరిత్ర ఆ విధంగా ముందుకెళ్లింది. సైన్స్‌ ఈ విధంగా డీకోడ్‌ చేస్తోంది.

సుదీర్ఘ కాలప్రవాహంలో ఎవరు ఎవరితో కలిసిపోయారో తెలియనంతగా మిక్స్‌ అయిపోయిన మాట నిజమే. అయినా చాలా ముఖాల్లో యురేషియన్‌, సెంట్రల్‌ ఏషియన్‌ పోలికలు కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి. పదేళ్లకిందట కార్గిల్‌లో ఒక రోజు గడిపిన సందర్భంలో … ఆ చిన్నఊళ్లో, ఒకదానికొకటి సంబంధం లేకుండా – ఎన్నిరకాల ముఖాలు కనిపించాయో ! సింధుకి ఒక ఉపనది సురు. అదే పేరుతో అక్కడో లోయ. సీనియర్‌ జర్నలిస్ట్‌ టంకశాల అశోక్‌గారు, ఓసారి అక్కడి ప్రజల గురించి – సురులనగా వీరేనా ? అన్న టైటిల్‌తో ఓవ్యాసం రాశారు. వాళ్లు తమను తాము కల్తీ కాని, అసలు సిసలు ఆర్యులుగా భావించుకుంటారట. అన్నట్టు పోలికల గురించి చెప్పాలంటే రాజ్‌కపూర్‌ను గుర్తుచేసుకోవాల్సిందే. “మేరానామ్‌ జోకర్‌’ సినిమాలో- ఇండియాకి ఓ రష్యన్‌ సర్కస్‌ కంపెనీ వస్తుంది. పొట్టపోసుకోవడానికి అందులో ఎలాగోలా చొరబడతాడు. వాళ్లంతా , అతడి నీలికళ్లనూ, బ్రౌన్‌హెయిర్‌నూ చూసి తమ దేశం వాడేననుకుంటారు. దానికి తగ్గట్టే , అతడు కూడా పేరు అడిగితే ఇవాన్‌ రాజవిస్కీ అని చెబుతాడు. ఆ సినిమాలో అతడి పేరు రాజు. ఇది సినిమా కోసం కల్పించిన సంఘటనే కావొచ్చుగానీ, చాలా మంది రూపురేఖలు – పామీర్‌, హిందూకుష్‌ పీఠభూములకి అవతల జీవిస్తున్న ప్రజలకి దగ్గరగా ఉంటాయనిపిస్తుంది.

ఇక భాషలో కూడా ప్రాచీన బంధుత్వాన్ని పట్టిచ్చే లింగ్విస్టిక్‌ లింక్స్‌ కనిపిస్తాయి. రష్యన్లు అగన్‌ అంటే మనం అగ్ని అంటాం. డోర్‌ను మనం ద్వారమంటే , వాళ్లు ద్వెర్‌ అంటారు. రామ్‌గోపాల్‌ వర్మ తాగే వోడ్కా ఇంతా చేసి ఉదకమే. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ వరకూ భారతీయులు, భారతీయకల్చర్‌ ఉండేది. అక్కడి నుంచి రష్యా మరీ అంత దూరమేమీ కాదుగా!

-ఎస్.ఎస్.రావు, సీనియర్ జర్నలిస్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here