బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో డ్రగ్స్ తెరమీదకు రావటంతో నార్కోటిక్స్ విభాగం రంగంలో దిగి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిషేధిత మాదకద్రవ్యాల కోసం డ్రగ్స్ డీలర్లతో వాట్సాప్‌లో మాట్లాడరనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఐతే తనకు డ్రగ్స్ అలవాటు లేదని గతంలో రియా పేర్కొనగా, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ మాత్రం రియా,సుశాంత్‌లు కలిసి మారిజోనా డ్రగ్స్‌ను తీసుకునే వారని సీబీఐకి చెప్పినట్టు సమాచారం.
తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకు చెందిన ఐదుగురు అధికారులు ముంబైలోని రియా ఇంట్లో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు శామ్యూల్ మిరాండా ఇంటిని కూడా ఎన్సీబీ బృందం అణువణువూ తనిఖీ చేస్తోంది. కాగా, శామ్యూల్ మిరండా, సోదరుడు శౌవిక్ చక్రవర్తి కూడా కొన్ని సార్లు డ్రగ్స్ తీసుకునేవాడని శృతి చెప్పడంతో ఎన్సీబీ బృందం ఇతనిపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వారికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అనుమానిస్తున్న అబ్దుల్ బాసిత్, జైద్ విల్తారా అనే ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ అధికారులు అరెస్టు చేశారు. . కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి మార్చి 17న జైద్ ఫోన్ నంబరును సుశాంత్ మేనేజర్ మిరాండాకు షేర్ చేసినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 10 వేల రూపాయల విలువ గల 5 కిలోల డ్రగ్స్‌ను కొనుగోలు చేసినందుకు జైద్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా షోవిక్ కోరాడు.
ఈ క్రమంలో మిరండా జైద్‌కు మూడు సార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది. భాసిత్ ద్వారా జైద్ నంబర్ వీరికి తెలిసినట్లు సమాచారం. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ ఎదుట హాజరైన అతడి మేనేజర్ శృతి మోదీ సుశాంత్, రియా కలిసి గంజాయి తాగేవారని వెల్లడించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు షోవిక్, మిరండా టెర్రస్ మీద గంజాయి పీల్చేవారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి తాము మీడియాకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని సీబీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు ముగిసేలోగా ఇంకెన్ని నిజాలు వెలుగు చూస్తాయో తెలియదు. దర్యాప్తు జరిగే కొద్దీ బాలీవుడ్ అసలు రూపం బయట ప్రపంచానికి తెలుస్తోంది.