మురిపిస్తున్న మూడు సీట్లు..అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఫైట్

0
126

గవర్నర్ కోటాకు యమా డిమాండ్..
నాయినితో టెన్షన్.. రేసులో పీవీ కూతురు
గులాబీ బాస్ మదిలో ఎవరున్నారు?
దేశపతా..? దేవీ ప్రసాదా?

అధికార టీఆర్ఎస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ చిచ్చు రేగుతోంది. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నా.. అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు గులాబీ బాస్. ఎక్కువ మంది అశావహులు ఉండటం, సీటు దక్కకపోతే కొందరు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ఐబీ సమాచారంతో కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. నాయిని నర్సింహా రెడ్డి టర్మ్ జూన్ లోనే ముగిసింది. రాములు నాయక్ పార్టీమారడంతో ఆయనపై అనరత వేటు పడి ఆ స్థానం ఖాళీ అయింది. మరో ఎమ్మెల్సీగా ఉన్న కర్నె ప్రభాకర్ టర్మ్ ఆగస్టు 18తో ముగిసింది. గతంలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే.. రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేసి ఎంతో ముందే ప్రకటించేవారు కేసీఆర్. అయితే సీట్లు ఖాళీగా ఉండి చాలా రోజులవుతున్నా.. ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో నెలకన్న పరిస్థితులే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది.

నాయినికి ఇవ్వకపోతే తిరుగుబాటే!
మాజీ హోం మంత్రి నాయిని తనకు మరో చాన్స్ దక్కుతుందని ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన అల్లుడికి టికెట్ ఇవ్వనందుకు, తనకు మరోసారి ఎమ్మెల్సీపదవిని కేసీఆర్ ఇస్తారని నాయిని తన అనచరులతో చెబుతున్నారు. నాయినికి మరోసారి అవకాశం ఇవ్వకపోతే ఆయన తిరుగుబాటు చేస్తారనే భయం టీఆర్ఎస్ లో ఉంది. ఇటీవల మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ చేసినన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఉద్యమంలో ముందున్న నేతలకు అన్యాయం జరుగుతుందని స్వామిగౌడ్ ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు నాయిని. మొదటి టర్మ్ లో మంత్రి పదవి ఇచ్చినా… సెకండ్ టర్మ్ లో తీసుకోలేదు. రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు. దీంతో చాలా కాలంగా నాయిని అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని సార్లు తన అసంతృప్తిని ఓపెన్ గానే బయటపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే ఆయన తీవ్ర నిర్ణయం తీసుకోవచ్చని టీఆర్ఎస్ నేతలు ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది.

రేసులో పీవీ కుమార్తె వాణిదేవి.. టెన్షన్ లో దేశపతి?
ఇటీవలే పదవి కాలం పూర్తైన కర్నె ప్రభాకర్ తనకు రెన్యూవల్ ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పార్టీ నుంచి ఆయనకు సిగ్నల్స్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవికోసం దేవీ ప్రసాద్, దేశపతి శ్రీనివాస్ ఆశపడుతున్నారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పీవీ కూతురు వాణీ దేవిని సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతుంది. సర్కారు నిర్వహిస్తున్న పీవీ శతజయంతి ఉత్సవాల కారణంగా వాణీ దేవి తరచుగా సీఎం కేసీఆర్ ను కలుస్తున్నారు. కాంగ్రెస్ లోపీవీకి అన్యాయం జరిగిందని కేసీఆర్ అన్నారు. వాణీ దేవిని ఎమ్మెల్సీగా ఎంపికచేసి ఆ కుటుంబానికి న్యాయం చేశామని కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. రేసులోకి వాణీ దేవి ఎంటరవడంతో తమ చాన్స్ కు ఆమె గండి కొడుతుందేమోనని.. ఆమె సామాజిక వర్గానికే చెందిన దేశపతి, దేవీ ప్రసాద్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది.

కొత్త వారికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్ ?
రాములు నాయక్ స్థానాన్ని తనకు ఇస్తారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ధీమాలో ఉన్నారు. 2014లో ఎంపీగా ఉన్న నాయక్ కు గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. గతంలో ఆయనను మండలికి పంపిస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా మంది లీడర్లు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలోపడ్డారు. సమయం వచ్చిన ప్రతిసారి కేటీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లానుంచి మాజీ మంత్రి తుమ్మల,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వరంగల్ జిల్లా నుంచి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, తక్కెళప్ల ల్లి రవీందర్ రావు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి అరెకల నర్సారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, కరీంనగర్ నుంచి తుల ఉమ, నల్గొండ నుంచి మందుల సామేలు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి బండి రమేశ్‌, క్యామ మల్లేష్ పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీసెక్రటరీ రమేష్ రెడ్డి కూడా ఎమ్మెల్సీస్థానాన్ని ఆశిస్తున్నట్టుతెలిసింది. కొత్తవారికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వస్తోంది. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక కేసీఆర్ కు చిక్కుముడిగా మారిందని చెబుతున్నారు. అందుకే గతంలో ఎప్పుడు లేనంతా సమయం తీసుకుంటున్నారని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది.
-ఎస్.ఎస్.యాదవ్, సీనియర్ జర్నలిస్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here