మళ్లీ ఢిల్లీ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్..

1
140

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తో సమరానికి టీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా బీజేపీ సర్కార్ తీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్.. సరైన సమయం కోసం చూస్తున్నారు. జీఎస్టీ బకాయిలపై కేంద్రం చేతులెత్తేయడంతో .. ఇదే అదనుగా గులాబీ బాస్  తన ప్లాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు.. బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.  కేసీఆర్ కార్యాచరణలో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.  రాజస్థాన్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్, పాండిచ్చేరి, ఒడిస్సా ఆర్థిక మంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  పాల్గొన్నారు.  జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను చర్చించారు. జీఎస్టీపై చర్చించడానికే అయినా .. బీజేపీని టార్గెట్ చేయడంలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత కేంద్రంపై భగ్గుమన్నారు హరీష్ రావు.రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు  చూస్తోందన్నారు.  రాష్ట్రాలకు సెస్‌ చెల్లించమంటే ఎలా అని, ప్రశ్నించిన హరీష్..  ఏ విధంగా అయిన రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు.

                             కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గతంలో చాలా సార్లు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశయ్యారు. మంత్రుల స్థాయిలోనూ చర్చలు జరిగాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా ప్రాంతీయ పార్టీ నేతలతో పలు సార్లు సమావేశం జరిపారు. కరోనా సమయంలోనూ ఆమె వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రాంతీయ పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. అయితే ఆ సమావేశాల్లో  కేసీఆర్ గాని, టీఆర్ఎస్ ప్రతినిధులు కాని పాల్గొనలేదు. బీజేపీ, కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తున్నామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు జీఎస్టీపై బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో హరీష్ రావు చర్చలు జరపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ డైరెక్షన్ లోనే హరీష్ నడుస్తున్నారని, మోడీ సర్కార్ తో పోరాటానికి గులాబీ బాస్ సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.   
                         2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తోంది టీఆర్ఎస్. పార్లమెంట్ లో బీజేపీసర్కార్  పెట్టిన కీలక బిల్లులకు మద్దతు ఇచ్చింది. మిషన్ భగీరథ ప్రారంభోత్సవాన్ని  ప్రధాని చేతుల మీదుగానే నిర్వహించారు కేసీఆర్. 2018 తర్వాత  బీజేపీతొ గులాబీ పార్టీకి కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపించింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని  ప్రకటించారు కేసీఆర్. అయితే మోడీకి ఏకపక్ష విజయం దక్కడంతో ఆ ప్రతిపాదన మూలకు పడింది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. కేసీఆర్ సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీని టార్గెట్ చేశారు కేసీఆర్. అయితే కేంద్రంతో మాత్రం సంబంధాలు కొనసాగించారు. కరోనాతో వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో కేంద్రం సాయం కోరారు కేసీఆర్. అటు నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్రం తీరుపై ప్రాంతీయ పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయని గ్రహించిన కేసీఆర్.. మళ్లీ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే బీజేపీయేతర రాష్ట్రాల  ఆర్థికమంత్రులతో హరీష్ రావు చర్చించారని సమాచారం. త్వరలోనే కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. వ్యవసాయంపై ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించబోతున్నానని ఇటీవలే ప్రకటించారు కేసీఆర్. దేశ రాజకీయాలపై చర్చించడానికే ఆ సమావేశం పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో కేంద్ర రాజకీయాల్లో ఇకపై కేసీఆర్ క్రియాశీలకంగా ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి.బీజేపీ టార్గెట్ గానే ఆయన ముందుకు వెళతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

-ఎస్.ఎస్.యాదవ్, సీనియర్ జర్నలిస్ట్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here