ఒక సినిమా హిట్టా ఫ్లాపా అన్నది కలెక్షన్లను బట్టి ..అది ఎన్ని రోజులు ఆడిందనే దానిపై ఉంటుంది. మరి ఓ టీవీ షో హిట్టయిందో ఫట్టయిందో ఎలా తెలియాలి? టిఆర్పి రేటింగ్ బట్టి దానికి ఉన్న ప్రేక్షకాదరణ తెలుస్తుంది. ఒక ప్రోగ్రాంని ఎంతమంది చూసారు? ఎంత సేపు చూసారో లెక్కలు వేసి టిఆర్పి రేటింగ్ ఇస్తారు.
అత్యంత హైప్ క్రియేట్ చేసిన స్టార్ మా బిగ్ బాస్ 4 అంతా అనుకున్నట్టే రికార్డు స్థాయిలో రేటింగ్ సంపాదించింది. ఇప్పటికే స్టార్ మా తెలుగు జనరల్ ఎంటర్టైన్మైంట్ చానల్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లాంఛింగ్ ఎపిసోడ్ రేటింగ్.. రికార్డ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
నాన్ ఫిక్షన్ షో కేటగిరీలో బార్క్ యూనివర్స్‌లో ఇప్పటివరకు రానంతగా అత్యధిక రేటింగ్స్ సాధించిన ఎపిసోడ్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్ నిలిచినట్లుగా స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. అలాగే తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్ బాస్ షోలకు సంబంధించి.. అన్నిటికంటే అత్యధిక టీఆర్పీ 18.5ని ఈ షో సాధించినట్లుగా కూడా స్టార్ మా తెలిపింది.
స్టార్ మా చెబుతున్న గణాంకాలను బట్టి చూస్తే.. స్టార్ మా గతంలో లేనంతగా అత్యధికంగా 1122 జీపీఆర్‌లతో తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో టాప్ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగు వారాలతో పోలిస్తే స్టార్ మా సరికొత్త బ్రాండ్ ఐడెంటిటీ18 శాతం పెరిగినట్లుగా రివీల్ చేసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 4 విషయానికి వస్తే.. సరైన కంటెస్టెంట్స్ లేని ఈ షో నిలబడటం చాలా కష్టమే అని ఇప్పటికీ.. బిగ్ బాస్ వ్యూవర్స్ అనుకుంటుండటం విశేషం.
మరోవైపు, ‘బిగ్ బాస్-4’ ఫస్ట్ వీక్ రిజల్ట్ మరోలా ఉంది. కంటెస్టెంట్స్ వీక్‌గా ఉన్నారనే కామెంట్స్ ‘బిగ్ బాస్-4’ని చుట్టుముట్టినా.. ఈ రియాలిటీ షో ఓపెనింగ్ ఎపిసోడ్‌కు మాత్రమే అత్యధిక (18.5) టీఆర్పీ రావటం విశేషం. ఇది మంచి రేటింగే అయినా… ‘మా’లోనే ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’, ‘గృహలక్ష్మి’ సీరియల్స్ రేటింగ్ ను మాత్రం ఈ షో బీట్ చేయలేకపోయింది. కార్తీక దీపం మొదటి ఆరు స్థానాల్లో నిలవగా… ఆ తర్వాత గృహలక్ష్మి, ఆపై బిగ్ బాస్-4 నిలవటం గమనార్హం.
కరోనా కష్ట కాలంలో బిగ్ బాస్ 4 ఉంటుందో ఉండదో అన్న సందేహాలు చుట్టు ముట్టినా ..చివరకు బిగ్ బాస్ 4 బుల్లి తెరపై కనిపించాడు. అన్నీ కొత్త ముఖాలే.. కాస్తో కూస్తో సోషల్ మీడియా, సినిమా నాలెడ్జ్ ఉంటే తప్ప తెలియని వారితో మ్యాజిక్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. చివరి వరకు అదే కిక్ ఉంటుందో లేదో చూడాలి.