కాంగ్రెస్ డిఎన్ఏ లోనే అసమ్మతి…వారికి వారే టార్గెట్..

0
88

కాంగ్రెస్ డిఎన్ఏ లోనే అసమ్మతి ఉంది. ఒక వేళ అసమ్మతి లేదంటే అది కాంగ్రెస్ పార్టీకే అవమానం. నాడు ఇందిరా గాంధీ నుంచి నేడు సోనియా గాంధీ వరకు అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ లో ఒక భాగం. దానికి ఆ పార్టీ పెట్టుకున్న ముద్దు పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. అయితే అధినాయకత్వాన్ని మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదు. అది రూల్..ఇక రాష్ట్రాలు..జిల్లాలు..మండలాలు..గ్రామాలు ఎక్కడైనా సరే పార్టీ నిండా అంతర్గత ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అందుకే ఎవరు ఎవరినైనా ప్రశ్నించొచ్చు.. ఒకరి మీదికి ఒకరు కుర్చీలు విసురుకోవచ్చు.. ఇక ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మూడు గ్రూపులు… ఆరు గొడవలు.

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాా…

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా హస్తంలో నేతల మధ్య అధిపత్య పోరు కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. అగ్రనేతలంతా ఎవరికివారే సొంత మైలేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా కట్టడి,, వరద సహాయ చర్యల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందనే భావన ప్రజల్లో ఉంది. సీఎం కేసీఆర్ పాలనపై గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వివిధ సంస్థలు చేసిన సర్వేల్లో తేలింది.
గత ఆరు నెలల్లో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చాలా సంస్థల అభిప్రాయ సేకరణలో వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లి మైలేజీ పెంచుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడుతోంది. ప్రజా సమస్యలపై ఒకరు పోరాడితే మిగితా వారు అతనికి సహకరించడం లేదు. ఆ నేతకు పోటీగా మరో నేత మరో కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇలా సొంతంగానే ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తూ … మిగితా వారి సహకారం లేక తుస్సుమంటున్నారు.


వారికి వారే టార్గెట్…

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మంటలు వచ్చిన కొన్ని గంటలకే సర్కార్ కుట్ర ఉందంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ఆరోపణలు ప్రజల్లోనూ చర్చకు దారి తీశాయి. శ్రీశైలం వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ అంశాన్ని జనాల్లోకి మరింతగా తీసుకువెళితే కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చి కారు పార్టీ ఇబ్బందుల్లో పడేది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందులో పూర్తిగా విఫలమయ్యారు. పోరాటానికి దిగిన రేవంత్ రెడ్డికి ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో ఒంటరిగానే వెళ్లారు రేవంత్ రెడ్డి. అయితే ఎవరికి చెప్పకుండానే ఏకపక్ష నిర్ణయాలతో రెేవంత్ వెళ్లారని కాంగ్రెస్ లోని మరో వర్గం ఆరోపిస్తోంది. అందరు కలిసి ఉమ్మడిగా పోరాడితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేదని, రేవంత్ తొందరపాటు చర్యలతో మంచి అవకాశం చేజారిపోయిందని చెబుతున్నారు. రేవంత్ వర్గం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. కేసీఆర్ తో కొందరు నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు.

ఉత్తమ్ సైలెంట్..పిసిసిపై మల్లు గురి..

పీసీసీ చీఫ్ పదవి కోసమే భట్టీ యాత్ర చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ గానే ఉంటున్నారు. తనను మార్చాలని గతంలోనే హైకమాండ్ ను కోరిన ఉత్తమ్.. పరిమితంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప దూకుడుగా వ్యవహరించడం లేదు. నల్గొండ జిల్లాకే చెందిన మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నా… అవన్ని తన పీసీసీ చుట్టే తిరిగేలా మాట్లాడుతున్నారు. తనకు పార్టీ పగ్గాలు ఇస్తే టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటా అని చెబుతున్నారు కాని ప్రజా సమస్యలపై మాాత్రం సీరియస్ గా స్పందించడం లేదు. పీసీసీ బాాధ్యతలు తనకే ఇవ్వాలని, మరొకరికి ఇస్తే ఒప్పుకునేది లేదంటూ బెదిరించే దోరణిలో వెళుతున్నారు కోమటిరెడ్డి. రేవంత్ టీమ్ ను దూరం పెడుతున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్.


ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు.. ఒకరికొకరు టార్గెట్ చేసుకుంటూ కేడర్ ను మరింత గందరగోళంలో పడేస్తున్నారు. కోటి పది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో నాగరాజు ఎపిసోడ్ కాంగ్రెస్ లో వర్గ పోరుకు తెర లేపింది. నాగరాజు కేసులో అరెస్టైన శ్రీనాథ్, అంజిరెడ్డికి రేవంత్ రెడ్డితో సంబంధాలున్నాయని టీఆర్ఎస్ ఆరోపించింది. అంజిరెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ కూడా దొరికాయి. ఇలాంటి సమయంలో పార్టీ ఎంపీకి అండగా ఉండాల్సిన కాంగ్రెస్ లీడర్లు ఆయననే టార్గెట్ చేశారు. ఎంపీ సంగతి తేల్చాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తర్వాత వీహెచ్ ను ఉద్దే శించి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కీసర ఘటన కాంగ్రెస్ లో వర్గపోరును బహిర్గతం చేసింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ రేసులో ఉన్నానని చెబుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇస్తే ఊరుకునేది లేదంటూ పరోక్షంగా రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నేతల తీరుపై కేడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై పోరాటానికి మంచి అవకాశాలు వచ్చినా నేతల తీరుతో చేజార్చుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది. లీడర్ల తీరు మారకపోతే కేసీఆర్ ను ఎదుర్కోవడం కష్టమని చెబుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here