అంతర్జాతీయ వేదికపై మరోమారు పాకిస్తాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్టీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉపన్యాసం ప్రారంభం అయిన వెంటనే భారత ప్రతినిధి హాల్ నుంచి వాకౌట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం నాటి సర్వసభ్య సమావేశానికి వర్చువల్గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక కశ్మీర్ సమస్యను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిజిటో వినిటో వాకౌట్ చేశారు. అనంతరం పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టీఎస్ తిరుమూర్తి స్పందించారు. భారత్ వ్యతిరేక ప్రకటనకు తగిన సమాధానం చెప్తామన్నారు. ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరంగా చాలా తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
ఈ మేరకు తిరుమూర్తి ట్వీట్ చేశారు. ‘75 వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా తక్కువ స్థాయి దౌత్యపరమైన ప్రకటన చేశారు. పాకిస్తాన్ తన సొంత మైనారిటీలను హింసించడం గురించి, సరిహద్దు ఉగ్రవాదం గురించి దుర్మార్గపు అబద్ధాలు, వ్యక్తిగత దాడులకు దిగింది. ఇందుకు తగిన సమాధానం ఎదురు చూస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు.