పార్లమెంటులో ప్రవేశ పెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులను వ్యతిరేకిస్తూ హర్యానాలో రైతుల ఆందోళన తీవ్రమైంది. మునానగర్ జిల్లాలోని మిల్క్ మజ్రా గ్రామా సమీపంలోని అంబాలా-రూర్కీ జాతీయ రహదారి ఎన్ హెచ్ 344 ని బ్లాక్ చేశారు. దాంతో పాటు రాష్ట్రంలోని పలు జాతీయ, రాష్ట్ర రహదారులపై వేలాది మంది రైతులు బైఠాయించారు.
భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చారుని యమునానగర్ నిరసనలకు నాయకత్వం వహించారు.రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మూడు వ్యవసాయ ఆర్డినెన్సులపై ఆందోళనకు మద్దతునిచ్చినందుకు రైతు లోకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదించడానికి ప్రయత్నిస్తోన్న విషయం విదితమే.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను వాడుకుని రైతులపై తప్పుడు కేసులు బనాయించింది.అంతేకాదు రైతులలో చీలిక తచ్చేందుకు ప్రయత్నించింది కానీ అవి విఫలమయ్యయాయని ఆయన రైతులను ఉద్దేశించి అన్నారు.
మరోవైపు, కైతాల్‌లో రైతులు స్థానిక తిట్రామ్ మోర్ సమీపంలో అంబాలా-హిసార్ రహదారిని నిర్బంధించారు. మూడు గంటల పాటు హైవేని అడ్డుకున్నారు. సెప్టెంబర్ 25 న రాష్ట్రస్థాయి సమావేశం తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకుంటామని రైతు నేతలు స్పష్టం చేశారు.
కురుక్షేత్రలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. లాడ్వా, కురుక్షేత్ర , షాబాద్ పట్టణాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను జిల్లా రైతులు అడ్డుకున్నారు. కమిషన్ ఏజెంట్లు కూడా రైతులకు మద్దతునిచ్చారు. పోలీసులను మోహరించినప్పటికీ వారు రైతులను ఆపలేదు. ట్రాఫిక్ ను లింక్ రోడ్లకు మళ్లించారు. రైతులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తుండగా, కమిషన్ ఏజెంట్లు ధాన్యం మార్కెట్లో సమావేశం నిర్వహించి రైతుల నిరసనకు తమ మద్దతును ప్రకటించారు.
రైతు నాయకులకు రైతులు, కమిషన్ ఏజెంట్ల నుంచి భారీ మద్దతు లభించింది. సెప్టెంబరు 10 నిరసనలకు కేంద్రంగా ఉన్న కురుక్షేత్ర జిల్లాలోని ఐదు ప్రదేశాలలో రహదారులను అడ్డుకోవటానికి నిరసనలు వ్యాపించాయి. కర్నాల్, యమునానగర్ , కైతాల్ జిల్లాల్లో ఈ నిరసనలు జరిగాయి.
ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డి), కాంగ్రెస్ నిరసనలకు మద్దతు ఇస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు రైతులకు అండగా నిరసన ప్రదేశాలలో కనిపించారు.
హర్యానిలో బిజెపి పాలక కూటమిలోని జానాయక్ జనతా పార్టీకి చెందిన షాబాద్ ఎమ్మెల్యే రామ్ కరణ్ కాలా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులలో ఒకరు కావటం విశేషం. “రైతులకు నా మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడకు వచ్చాను, వారి ఆందోళనపై నేను ప్రభుత్వంతో మాట్లాడుతాను” అని అన్నారు. రాజీనామా చేసి ఆందోళనకు మద్దతు ఇవ్వమని రైతులు కోరినప్పుడు మాత్రం ఆయన వారికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. ముందు ముందు రైతు ఆందోళనలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.