కేసీఆర్ పాలన గాడితప్పుతోందా..?

0
45

పాలనాదక్షుడుగా కీర్తించబడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు పాలన ఇటీవలగాడి తప్పుతోందనిపిస్తోంది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు ఆయన పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. కరోనా కట్టడి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ సముద్రం పాలు కావడం, వరద వస్తున్నప్పుడు ఎత్తిపోయాల్సిన కల్వకుర్తి పంపులు బంద్ కావడం, శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో మంటలు, ప్రణాళిక లేకుండా చెరువుల్లో, డ్యాముల్లో వదిలిన చేప పిల్లలు వరదలో కొట్టుకుపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు జరిగాయి. అన్నింట్లోనూ కేసీఆర్ పాలనా వైఫల్యమే కనిపిస్తోంది. పక్క రాష్ట్రాలు పక్కా ప్రణాళికతో పోతుండగా.. కేసీఆర్ తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది.


అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజా ధనం వృధా…
రాష్ట్రంలో జూలైలోనే గోదావరిలో వరద మొదలైంది. అయితే లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పంపులు మాత్రం ఆన్ కాలేదు. ఆగస్టులో వరద పెరిగింది. భారీ వర్షాలతో ఎగువ గోదారితో సంబంధం లేకుండానే వరద వచ్చింది. అయితే వర్షాల సమయంలో అధికారులు ఎత్తిపోతల ప్రారంభించారు. మేడిగడ్డ నుంచి సుందిళ్ల మీదుగా అన్నారం బ్యారేజీకి నీటిని ఎత్తిపోశారు. అయితే భారీ వర్షాలకు వరదలు రావడంతో అన్నారం గేట్లు ఎత్తారు. దీంతో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీరంతా మళ్లీ మేడిగడ్డ ద్వారానే గోదాట్లో కలిసింది. జూలైలోనే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, లోయర్ మనేరు నుంచి చెరువులను నింపుకునే అవకాశం ఉండే. కాని ఆ సమయంలో పంపులు బంద్ చేసిన కాళేశ్వరం అధికారులు.. వరదల సమయంలో ఎత్తిపోసి తమ అజ్ఞానం చాటుకున్నారు. పాలకుల డైరెక్షన్ లోనే అలా చేశామని అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదనే అభిప్రాయం వస్తుందనే ఉద్దేశ్యంతోనే సర్కార్ అవరసం లేకున్నా ఎత్తిపోతల ప్రారంభించిందని చెబుతున్నారు. ఆ నీరంతా ఇప్పుడు సముద్రం పాలు కావడంతో ప్రభుత్వం ప్రజల మధ్య అభాసుపాలైంది. సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజా ధనం వృధా అవుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాము ముందు నుంచి చెబుతున్నదే నిజమైందని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ గా మారిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పుడు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
నిండా నిర్లక్ష్యం…
ఇక కృష్ణా బేసిన్ లో సర్కార్ మరో ఘనకార్యం చేసింది. కృష్ణమ్మ బిరబిరా దిగువకు వెళుతున్నా.. కల్వకుర్తి ఎత్తిపోతల చేపట్టలేదు మన అధికారులు. ఆగస్టు మొదట్లోనే జూరాల నుంచి శ్రీశైలానికి వరద వచ్చింది. అప్పుడే కల్వకుర్తి ద్వారా నీటిని ఎత్తిపోయాలి. అయితే కల్వకుర్తి పంప్ హౌజ్ సిబ్బందికి కరోనా సోకడంతో పంపులు ఆన్ చేసే వారే లేకుండా పోయారు. కరోనా సమయంలో ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోలేదు. దీంతో వరద సమయంలోనే సిబ్బంది కరోనాతో విధులకు దూరం కాగా.. పంపు హౌజులు మూలకు పడ్డాయి. దాదాపు 10 రోజుల పాటు భారీగా వరద వచ్చినా.. కల్వకుర్తి ఎత్తిపోతల జరగలేదు. సర్కార్ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశరు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని, పంపు హౌజ్ కు అదనపు సిబ్బందిని ఎందుకు నియమించుకోలేదని వారు నిలదీశారు. ఎత్తిపోతలు జరిగేది మూడు నెలలు.. ఆ సమయంలోనూ అధికారులు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎలా ఉంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మన సర్కార్ నిర్వాకంతో కల్వకుర్తి పంపు హౌజులు అగిపోగా.. అటు ఏపీ సర్కార్ మాత్రం నీటిని తరలించుకుపోయింది.దక్షిణ తెలంగాణపై కేసీఆర్ కు ఎంత చిత్తశుద్ది ఉందో ఈ ఘటన చెబుతుందని పాలమూరు రైతులు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నాారు.
మొద్దు నిద్రకు ఇదే సాక్ష్యం…
ఇక శ్రీశైలం పవర్ ప్లాంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ సర్కార్ మెద్దు నిద్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. భద్రతా లోపాలు, నిర్లక్ష్యం 9 నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్లాంట్ లో చిక్కుకుపోయిన సిబ్బందిని 15 గంటలైనా గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తోంది. పవర్ ప్లాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదనే వాదనలున్నాయి. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దింపాలనే విషయాన్ని సర్కారు మరిచిపోయింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని విద్యుత్ విభాగంలో చర్చ జరుగుతోంది. గురువారం రాత్రి 10.30 గంటలకు మంటలు చెలరేగాయి. దీంతో లోపలి నుంచి పరుగున బయటికి వచ్చిన కొందరు ఎంప్లాయిస్ హెడ్ క్వార్టర్ కు సమాచారం ఇచ్చారు. 9 మంది ప్లాంట్ లోనే చిక్కుకున్నట్టు చెప్పారు. వెంటనే రెస్క్యూ టీంను దింపాల్సిన ప్రభుత్వం నిదానంగా వ్యవహరించింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఫైర్ డీజీ.. సీఐఎస్ఎఫ్ సాయం కోరారు. అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ జరిగి దాదాపు తొమ్మిదిన్నర గంటలు దాటింది. ఫైర్​ డీజీ అభ్యర్థన మేరకు ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఐఎస్ ఎఫ్ టీమ్ మధ్యాహ్నం ఒంటి గంటకు సైట్ కు చేరుకుంది. రాత్రికి రాత్రే సీఐఎస్ఎఫ్ ను రప్పిస్తే కొందరైనా బతికి ఉండేవారనే విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు.శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల అసలు కారణాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తోన్న సీఐడీపై తమకు నమ్మకం లేదని తేల్చి చెప్పాయి.సీబీఐ దర్యాప్తులోనే ఈ ప్రమాదం వెనుక గల అసలు కోణం వెలుగులోకి వస్తాయని విపక్షాలు చెబుతున్నాయి. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబ సభ్యులు కూడా మంటలు రావడంపై అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here