తైవాన్లో ఆదివారం జరిగిన పతంగుల పండుగలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గాలిపటం తొక, దారం చుట్టుకుని ఇరుక్కుపోయిన ఓ చిన్నారి పతంగితో పాటూ గాలిలో ఎగిరింది. నేలకు కొన్ని మీటర్లు ఎత్తులో గాలివాటానికి అటూ ఇటూ ఊగిపోతూ చూపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. పాపను ఎలా రక్షించాలో తెలియక అక్కడున్న వారందరూ కంగారు పడిపోయారు. పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు.అయితే. అదఅష్టవశాత్తూ అక్కడున్న వారి ప్రయత్నాలు ఫలించి..పతంగి నేలకు దగ్గరగా రావడంతో వారు చిన్నారిని నేర్పుగా ఒడిసి పట్టుకుని కిందకు దింపారు.
గాలిపటానికి చిక్కిన చిన్నారికి మూడేళ్ల వయసు ఉంటుందని సమాచారం. ఒక్కసారిగా గాల్లోకి లేవడంతో ఆ చిన్నారి హాహా కారాలు పెట్టింది. అంతటి కంగారులోనూ ఆమె గాలిపటాన్ని గట్టిగా పట్టుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. అక్కడి వారి ప్రయత్నం కారణంగా ఆమె సురక్షితంగానే నేల మీదకు చేరిందని, చిన్నారికి ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం.