ఈ మహిళలు ఏనాడో ప్రపంచాన్ని జయించారు..

0
47

పురుషాధిక్య సమాజంలో మహిళలునేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఐతే కొందరు మహిళలు చాలా దశాబ్దాల క్రితమే ప్రపంచాన్ని జయించి ఈ ఆ విషయం నిరూపించారు. ముఖ్యంగా సినీ రంగంలో. ఎందుకంటే మహిళలకు అత్యంత అభద్రత గల రంగం అని భావించే రంగాలలో సినిమా రంగం ఒకటి. ఇక సినిమా ఫీల్డ్ లో మహిళలు అనగానే మనకు అందమైన హీరోయిన్లు..క్యారెక్టర్ ఆర్టిస్టులు..నేపథ్య గాయనీమణులే గుర్తుకు వస్తారు..కాని దర్శకత్వం..సంగీత దర్శకత్వంతో పాటు ఇంకా అనేక విభాగాలలో వారి ఉనికే కనిపించదు. అయితే భారతదేశంలో సినిమా పుట్టినప్పుడే ఇద్దరు మహిళలు మ్యూజిక్ కంపోజర్లుగా అద్భుత విజయాలు సాధించారు. నేటి తరానికే కాదు అంతకు ముందు తరంలో కూడా ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఆ ఇద్దరు మహిళలో ఒకరు జద్దన్ భాయి హుస్సేన్ ..మరొకరు సరస్వతీ దేవి.


బాలీవుడ్ తొలి మహిళా సంగీత దర్శకురాలు.

భారతీయ సినిమా తొలినాళ్లలో జద్దన్ భాయి సింగర్ గా..మ్యూజిక్ కంపోజర్ గా విశేషంగా రాణించారు. ఆమె తల్లి దలీపాబాయి అలహాబాద్ లో ప్రముఖ నాట్యగత్తె. జద్దన్ బాయి ఐదేళ్ల వయస్సులో తండ్రి మియాజాన్ చనిపోయాడు. తరువాత ఆమె కలకత్తాకు చెందిన శ్రీమంత్ గణపతిరావు సంగీతంలో శిక్షణ పొందారు. ఆమె అక్కడ ఉండగానే ఆయన మరణించారు. దాంతో ఆమె ఉస్తాద్ మొయినుద్దీన్ ఖాన్ దగ్గర శిక్షణ పూర్తి చేశారు. అనంతర కాలంలో ఆమె సింగర్ గా..నాట్య కారిణిగా పాపులర్ అయ్యారు. దేశంలోని అనేక నగరాల్లో కచేరీలు చేశారు. తరువాత 1933లో రాజా గోపీచంద్ చిత్రం ద్వారా జద్దన్ బాయి నటిగా సినీ రంగానికి పరిచయమయ్యారు. తరువాత మరో రెండు మూడు చిత్రాలలో నటించారు. సంగీత్ ఫిల్మ్స్ పేరుతో సొంత కంపెనీ స్థాపించి 1935లో తలాషే హక్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆమె సంగీత దర్శకురాలు. ప్రఖ్యాత నటి నర్గిన్ ఈ చిత్రంలో బాల నటిగా నటించారు. అలాగ 1936లో మాడమ్ ఫ్యాషన్ చిత్రానికి దర్శకత్వం ..సంగీత దర్శకత్వం వహించారు.


నర్గిస్ తల్లి ..సంజయ్ దత్ అమ్మమ్మ
ఇక జద్దన్ బాయి వ్యక్తిగత జీవిత విశేషాలు చూస్తే..ఆమె మూడు సార్లు వివాహం చేసుకున్నారు. మదటి భర్త గుజరాతీ హిందూ కుటుంబానికి చెందిన నరోత్తమ్ దాసు ఖత్రి..వివాహ సమయంలో అతడు ఇస్లాం మతం స్వీకరించాడు. వారికి ఇద్దరు కుమారులు. ఆమె రెండో వివాహం హార్మోనియం కళాకారుడు ఉస్తాద్ ఇర్షాద్ మీర్ ఖాన్…నటుడు అన్వర్ హుస్సేన్ వీరి కుమారుడే. ఇక ఆమె మూడవ వివాహం పంజాబీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోహన్ చంద్ ఉత్తమ్ చంద్ త్యాగి. వీరి కుమార్తే ప్రఖ్యాత నటి నర్గీస్.

త్యాగి ఇస్లాం మతంలోకి అబ్దుల్ రషీద్ గా పేరు మార్చుకున్నా ఇంట్లో అన్నీ హిందూమత ఆచారాలనే పాటించేవారు. కొన్ని అధికార పత్రాల ప్రకారం జద్దన్ బాయి హిందూ పేరు జయదేవి త్యాగి గా పేర్కొన్నారు. హిందీ సినీరంగాన్ని ఏలిన అలనాటి నాయిక నర్గిస్ జద్దన్ బాయి కూతురే. సంజయ్ దత్ ఆమె మనవడు. జద్దన్ బాయి దాదాపు అరడజనుకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని సమకూర్చారు.


1930,1940లలో ఈమెదే హవా…
ఇక మరో మహిళా సంగీత దర్శకురాలు సరస్వతీ దేవి. 1930,1940లలో పలు హిందీ సినిమాలకు సంగీతం అందించారు. 1936లో వచ్చిన బాంబే టాకీస్ వారి అచుత్ కన్య కు సంగీతం అందించింది ఈమే. 20 ఏళ్ల తన కెరీర్ లో దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు సరస్వతీదేవి.


పార్సీ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే సంగీతం అంటే ఎంతో ప్రేమ ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె తండ్రి విష్ణు నారాయణ్ భట్ఖండే హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ధ్రుపద్,ధమర్ శైలిలో పాడటం ఆమె ప్రత్యేకత. తరువాత ఆమె లక్నోలోని మారిస్ కాలేజీలో చేరి సంగీతం అభ్యసించారు. 1920 ల చివరలో ముంబైలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఏర్పాటు చేశారు. ఆమె తన సోదరి మానేక్‌తో కలిసి రెగ్యులర్ గా రేడియోలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. హోంజీ సిస్టర్స్ పేరుతో ఈ కార్యక్రమం శ్రోతలలో విశేష ప్రాచుర్యం పొందింది. అదే సమయంలో బొంబాయి టాకీస్ వ్యవస్థాపకుడు, హిమాంశు రాయ్ తన సినిమాలకు మంచి క్లాసికల్ మ్యుజీఫియన్ ను వెతికే పనిలో ఉన్నారు. ఆమె పాటలను రేడియోలో విని తన సినిమాలకు సంగీతం అందించాలని కోరారు. అలా ఆమె కెరీర్ ప్రారంభమైంది. సరస్వతీ దేవిగా పేరు మార్చుకున్నారు.

1935 లో హిమాంశు రాయ్ భార్య దేవికా రాణి నటించిన జవానీ ఆమె తొలి చిత్రం. పార్సీ కుటుంబానికి చెందిన సరస్వతీ దేవి జీవితాంతం అవివాహితగానే ఉన్నారు. ఒక రోజు బస్సు నుంచి కింద పడటంతో ఆమె తుంటి ఎముక విరిగింది. సినీ రంగానికి చెందిన ఏ ఒక్కరూ ఆమెకు సాయపడలేదు. ఇరుగు పోరుగు వారు మాత్రమే ఆదుకున్నారు, 1980 ఆగస్టు 9న తన ఫ్లాట్ లో తుది శ్వాస విడిచారు. చనిపోయినప్పుడు ఆమె వెంట ఎవరూ లేరు. ఎన్నో మరపురాని జ్ఞాపకాలను వదిలివేసి వెళ్లిపోయారు.
బండెనక బండికట్టి… సంగీతం ఎవరు కూర్చారో తెలుసా..
ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి.. మా భూమి సినిమాలోని బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి… పాటను మనం కొన్ని వందల సార్లు విని ఉంటాం.. పాట పాడిన గద్దర్ గళం గుర్తుంటుంది కానీ ఆ పాటకు సంగీతాన్ని కూర్చిన వారెవరో మనకు తెలియదు.

మా భూమి సినిమాకు సంగీతం అందించింది ఓ మహిళ అని చాలా మందికి తెలియదు. ఆ సంగీత దర్శకురాలే వింజామూరి సీతా దేవి.ఆల్ ఇండియా రేడియోలో ఆమె ఫోక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా ఉండేవారు, ఎంతో మంది జానపద గాయకుల పాటలకు ఆమె సంగీతం సమకూర్చారు.

ఇప్పుడు ఎంతో మంది మహిళలు అన్ని రంగాలలో విజయవంతంగా రాణిస్తున్నారు. పురుషలకు సమానంగా సవాళ్లను ఎదుర్కొని నిలుస్తున్నారు. అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఐతే నేటి మహిళకు స్పూర్తి అలనాటి మహిళామణులే…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here