వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేయడంతో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్బుక్ యాజమాన్యం నిషేధం విధించింది. ద్వేషపూరిత, హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలను పోస్ట్ చేయకూడదనే మా నిబంధనలను ఉల్లంఘించడంతో ఆయనపై నిషేధం విధించినట్లు ఫెస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాజాసింగ్‌ను ”ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల” జాబితాలో చేర్చామని, దీంతో ఆయన ఫొటో, వీడియో షేరింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అనుమతించబడవని అన్నారు. అతనికి ప్రాతినిథ్యం వహించే పేజీలు, గ్రూపులు, ఇతర ఖాతాలను కూడా కంపెనీ తొలగిస్తుందని చెప్పారు.
భారత్‌లో అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఫేస్బుక్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఫేస్బుక్ సంస్థ.. ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇటీవల ఫేస్‌బుక్‌కు సంబంధించి వాల్‌స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఫేస్బుక్లో బీజేపీ నేతలు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనం రాసింది. భారత్‌లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది. బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో మన బిజినెస్ దెబ్బతినే ప్రమాదముందని ఫేస్బుక్ ప్రతినిధి అంఖీ దాస్ ఉద్యోగులతో అన్నట్టు తన కథనంలో పేర్కొంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వ్యాపార అవకాశాలను దెబ్బతీయకుండా ఉండటానికి ఓ బిజెపి నేతతో పాటు ముగ్గురు “హిందూ జాతీయవాదులు, గ్రూపులు చేసిన ద్వేషపూరిత ప్రసంగాలపై ఫేస్బుక్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్ కళ్ళు మూసుకున్నారు.
-ది వాల్ స్ట్రీట్ జర్నల్

ఫేస్బుక్ బీజేపీకి అనుకూలంగా.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. దీనిపై వివరణ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేత్రుత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫేస్బుక్ యాజమాన్యానికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫేస్బుక్ ఇండియా చీఫ్ అజిత్ మోహన్ బుధవారం కమిటీ ముందు హాజరయ్యారు. 2గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాడి వేడి వాదన జరిగింది. ఇరు పార్టీలు ఫేస్‌బుక్‌పై పలు ప్రశ్నలు సంధించాయి.
భారతదేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ ఫేస్బుక్ ,వాట్సాప్‌లను నియంత్రిస్తాయి. దాని ద్వారా వారు ఫేక్ న్యూస్ ను, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి దానిని ఉపయోగిస్తారు. ఎట్టకేలకు , అమెరికా మీడియా ద్వారా ఫేస్బుక్ గురించిన నిజం వెలుగు చూసింది.
-రాహుల్ గాంధీ
మరోవైపు, విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యల పట్ల ఫేస్బుక్ ఎన్నిసార్లు చర్యలు తీసుకుందని స్టాండింగ్ కమిటీలోని ఎంపీలు ఫేస్బుక్ ప్రతినిధులను ప్రశ్నించారు. తమ దానికి సంబంధించి ప్రత్యేక గణాంకాలేవీ లేవని వారు బదులిచ్చారు. చాలా సందర్భాల్లో ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఫేస్బుక్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందా అన్న కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. మరోవైపు ఫేస్బుక్ సంస్థ కాంగ్రెస్, వామపక్షాలకు అనుకూలంగా పనిచేస్తోందంటూ బీజేపీ పలు ఉదాహరణలను ప్రస్తావించింది. ఏదేమైనా రాజాసింగ్ ని నిషేధించటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇది రాజా సింగ్ తోనే ఆగుతుందా..లేదంటే ఈ లిస్టులో ఇంకెంత మంది ఉంటారో ఫేస్ బుక్కే చెప్పాలి..!!