స్టార్ల పని తీరినట్టేనా..? పాపం పెద్ద హీరోలు…!

0
51

కొద్ది రోజుల క్రితం ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ఓ మాట అన్నారు.. అదేమిటంటే ఇక స్టార్ సిస్టం పని అయిపోయిందని. ఆయన ఆ మాట ఎందుకు అన్నారో ఆయన మటల్లోనే.. “ కరోనా మూలంగా కనీసం సంవత్సరం థియేటర్లు తెరుచుకోవు. కాబట్టి మొదటి వారంలో 100 ప్లస్ కోట్ల వ్యాపారం అన్న హైప్ కు ఇక నీళ్లు వదులుకోవాల్సిందే. థియేట్రికల్ స్టార్ సిస్టమ్ చనిపోయినట్టే. స్టార్స్ ఇప్పటికే ఉన్న OTT ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలి లేదా వారి సొంత యాప్ ద్వారా సినిమాల విడుదల చేసుకోవాలి. ’’ .. ఆయన చెప్పిందే ఇప్పుడు జరుగుతోంది.


సుడిగుండంలో సినిమా ..
బాలీవుడ్ లో పలు భారీ బడ్జెట్ చిత్రాలు ఆగిపోయాయి.. పూర్తయిన సినామకు విడుదలయ్యే దారి లేదు. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి కూడా దాదాపు అంతే. అందుకు తాజా ఉదాహరణ తమిళ సూపర్ స్టార్ విజయ్ తాజా చిత్రం మాస్టర్. సినిమా విడుదలకు రెడీగా ఉంది. కానీ థియేటర్లు మూతపడ్డాయి. థియేటర్లు రీ ఓపెన్ అయ్యే వరకు వేచి చూసే పరిస్థితి లేదు. వేరే మార్గం లేక ఓటీటీ ఫ్లామ్ ని ఆశ్రయించినట్టు సమాచారం. నిజానికి ఈ చిత్రం షూటింగ్‌, రీరికార్డింగ్‌, డబ్బింగ్‌ పూర్తయి తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్‌ తొమ్మిదిన విడుదల కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జేవియర్‌ బిరిటో ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాట్టు తెలుస్తోంది..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సహా అన్ని ఓటీటీ సంస్థలు ‘మాస్టర్‌’ చిత్రాన్ని కొనేందుకు పోటీపడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ చిత్రాన్ని కొనేందుకు ఓటీటీ సంస్థలు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా ఆఫర్లు ప్రకటించాయి. ఈ బంపర్‌ ఆఫర్‌కు ‘మాస్టర్‌’ చిత్రనిర్మాణ సంస్థ అంగీకరిస్తుందని కోలీవుడ్‌ అంతటా పుకార్లు బయల్దేరాయి. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాత పదే పదే చెబుతున్నప్పటికీ, ఓటీటీ సంస్థలు చిత్రం కొనుగోలుకు విపరీతంగా పోటీపడుతున్నాయి. ఈ పోటీ కారణంగా ఈ చిత్రం రేటు వందకోట్లు దాటే అవకాశం కూడా ఉందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ..కాని పరిస్థితికి ఇది అద్దం పడుతోంది.


సంక్రాంతి సందడి ఉంటుందా…
ఒక్క విజయ్ మాత్రమే కాదు చిరంజీవి ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’ మూవీ ఇలా చాల సినిమాలు థియేటర్స్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. అక్టోబర్ నాటికి అంటే మరో మూడు నెలలకు సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయని అనుకున్నా..జనం మునపటిలా సినిమా థియేటర్లకు వెళ్లి చూస్తారా అన్నది అనుమానమే. అలాగే ప్రభుత్వం ఏ విధానంలో థియేటర్ల పునప్రారంభానికి అనుమతిస్తుంది అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఈ లోపు దసరా దీపావళి వెళ్లి పోయి సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. ఇంత వరకు ఒక కథ.. ఇంకో కథ ఏమిటంటే .. మన పెద్ద హీరోలు భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే కమిట్ అవుతారు. పారి తోషికాలు కూడా భారీగానే ఉంటాయి. బడ్జెట్ లో ఎక్కువ మొత్త వారి పారితోషికానికే పోతుంది. కరోనా క్రైసిస్ లో కూడా వారి వైఖరి మారకుంటే కష్టమే. ఎంత పెద్ద నిర్మాత అయినా ఈ సమయంలో కోట్లకు కోట్లు కుమ్మరించే సాహసం చేయలేరు.


పెద్ద నటులు తగ్గరా…
ప్రస్తుతం ఏ సినిమా సెట్ మీద లేని పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి..ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. మరి వారి పరిస్థితి ఏమిటి? చిన్న , ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలు ఓటీటీలో విడుదలై పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటయ్యే రేటు సంపాదించుకోవచ్చు. మరి మన పెద్ద హీరోలు మారిన పరిస్థితిలో కాస్త తక్కువ బడ్జెట్ సినిమాలకు ఓకే చెపుతరా? అలాగే తమ పారితోషికాన్ని తగ్గించుకుంటారా అన్నది సందేహం. ఇది జరగాలంటే ఒకరిద్దరు ముందడుగు వేయాలి. ఇప్పటికే తమిళనాట ‘నడిగరసంఘం’ అధ్యక్షుడు నాజర్‌ మొదలు ‘బిచ్చగాడు’ ఫేమ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ , ‘సింగం’ దర్శకుడు హరి పారితోషికాలు తగ్గించుకున్నట్టు ప్రకటించారు. కానీ, రజనీ కాంత్‌, విజయ్‌, అజిత్‌ లాంటి వారు పెదవి విప్పలేదు. ఇక మన తెలుగు హీరోల తీరు సరే సరి.. పెదవి విప్పే సాహసం కూడా చేయట్లేదు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు , దర్శకులు టాప్ టెక్నీషియన్లు కూడా తమ పారితోషికం తగ్గించుకోవాలి. అలా కాకపోతే పెద్ద హీరోలను జనం క్రమంగా మరిచిపోయే ప్రమాదం ఉంది.


ఎవరెన్ని చెప్పినా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాటలను బట్టి కరోనా కష్టాలు ఇప్పట్లో తీరవు. పామాన్యుడు ఇన్నాళ్లూ పొదుపు చేసుకున్న చిన్న మొత్తాలు మరో రెండు మూడు నెలల్లో హారతి కర్పూరంలా కరిగిపోతాయి. అసలు సిసలు ఆర్థిక సంక్షోభం డిసెంబర్ తరువాత ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే సినిమా అన్నది సామాన్యుడి ఆలోచనల్లో కూడా ఉండదు. శేఖర్ కపూర్ చెప్పినట్టు బాక్సాఫీస్ అనే పదాన్ని కూడా జనం మర్చిపోయినా ఆశ్చర్యంలేదు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here