సిటీ బస్సులు ఇప్పట్లో లేనట్టేనా…?

0
107

హైదరాబాద్ రోడ్ల మీద సిటీ బస్సులు కనిపించక నాలుగు నెలలవుతోంది. దాంతో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణ చార్జీలు సామాన్యుడికి తలకు మించిన భారంగా మారాయి. అయినా చేసేది లేక ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అడిగినంత ఇచ్చి భారంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే వారి ప్రశ్న ఒక్కటే ..మళ్లీ సిటీ బస్సులు ఎప్పుడు మొదలవుతాయి? మరి సర్కార్ మదిలో ఏముంది?


హైదరాబాద్‌ సిటీ బస్ సర్వీసుల పున:ప్రారంభం ప్రణాళికలు నిలిచిపోయాయి. అన్ లాక్ 4 మార్గదర్శకాలకు అనుగునంగా హోం మంత్రిత్వ శాఖ మెట్రో సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది. కాని బస్సుల గురించి మాత్రం ఏ విషయం తేల్చలేదు. ఇప్పటికే నాలుగు నెలలుగా ఈ బస్సులలో పనికి, ఉద్యోగాలకు వెళ్లే పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పుడప్పుడే అనుమతి ఇచ్చే సూచనలు కనిపించట్లేదు. నగరంలో కరోనా కేసులు తగ్గిన తర్వాతే సిటీ బస్ లు తిరిగి ప్రారంభమవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి అజయ్ కుమార్ అన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

కరోనాకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం కోటి మంది ప్రయాణీలకు తమ గమ్యస్థానాలకు చేర్చేది. అందులో 33 లక్షలు నగర ప్రయాణీకులే ఉంటారు. సిటీ బస్సు సర్వీసులను ఎలా పునరుద్ధరించాలో టిఎస్‌ఆర్‌టిసి ఇప్పటికే ప్రభుత్వానికి ఓ సమగ్ర ప్రణాళికను సమర్పించిందని. కానీ దానిపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆ ప్రణాళిక లో పలు సిఫార్సులు చేసింది ఆర్టీసీ. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కండక్టరు అవసరం లేకుండా ప్రధాన బస్‌స్టాప్‌లలో టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉంచటం. బస్‌స్టాప్‌లలో టిక్కెట్ల కోసం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ చెల్లింపు పద్ధతులను ప్రవేశపెట్టడం. బస్ టెర్మినల్స్ , అలాటే ఇంటర్‌చేంజ్ స్టేషన్లలో థర్మల్ స్కానర్లు, భౌతిక దూరం చర్యలకు వంటి సిఫార్సులు అందులో ఉన్నాయి. టికెట్ కౌంటర్లలో ప్రయాణికులు రద్దీ లేకుండా ఉండటానికి రోజువారీ, వీక్టీ బస్సు పాస్‌ల అమ్మకం వంటి అంశాలు కూడా ఆ ప్రణాళికలో ఉన్నట్టు సమాచారం. టిఎస్‌ఆర్‌టిసి చేసిన ప్రధాన సూచనలలో సీట్ల సంఖ్య తగ్గించడం ఒకటి. తక్కువ ఆక్యుపెన్సీ నిష్పత్తి ఉన్న మార్గాల్లో బస్సు సేవలను నిలిపివేసి తమ 800 సిటీ బస్సులను నగరంలోని ప్రధాన మార్గాల వెంట ప్రయాణించేవారికి వినియోగించేసూచన కూడా ప్రణాళికలో ఉంది. బస్‌స్టాప్‌ల వద్ద రద్దీని నివారించడానికి ప్రతి రెండు నిమిషాలకు ప్రయాణికులకు బస్సులను అందించాలనే ఆలోచన ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నగరంలో రెగ్యులర్ గా ఆర్టీసీ బస్ లో ప్రయాణించే వారు ఇప్పుడు అంతర్ జిల్లా బస్సుల వైపు చూస్తున్నారు. అది ఎలా అంటే. ఉదాహరణకు సంగారెడ్డి నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వెళ్లే బస్సు ఆ రూట్లో నగరంలో ఎక్కిన వారిని కూడా తీసుకుంటున్నారు. లింగంపల్లి, మెహదీపట్నం స్టాపులలో ప్రయాణీకులు ఎక్కుతున్నారు. అలాగే దిల్సుఖ్‌నగర్‌ వెళ్లాలంటే ఖమ్మం బస్సు పట్టుకుంటే చాలు. ఈ బస్సు ఎల్‌బి నగర్ నుంచి మాధాపూర్, బయోడైవర్శిటీ జంక్షన్‌ వరకు ప్రయాణికులను అనుమతిస్తుంది. ఖమ్మం నుంచి కెపిహెచ్‌బి బస్సులు అమీర్‌పేట్ , ఎస్ఆర్ నగర్‌ వెళ్లటానికి అనుమతిస్తాయి. టికెట్ ధర 50 రూపాయల లోపే. అంటే, ఆటో కన్నా చౌక. అయితే ముందుగా బస్సు కండక్టర్ ను అడిగిన తరువాతే బస్సు ఎక్కాలి. రెగ్యులర్ గా నగరంలో ప్రయాణించే వారికి మాత్రమే ఏ బస్ రూట్ ఎక్కడికో తెలుస్తుంది. చాలా మందికి అంత పరిజ్ఞానం ఉండదు. కానీ ఆర్టీసీ ఈ సమాచారం కూడా ప్రజలకు తెలిసేలా చేయలేకపోతోంది.

ఏదేమైనా సిటీ బస్సులను తిరిగి నడిపే అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రస్తుతం పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. అంటే పేద ప్రయాణీకుడికి మరికొన్నాళ్లు ఈ కష్టాలు తప్పేట్టు లేవు.!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here