చంద్రబాబులో కొత్త కోణం కనిపెట్టిన బీజేపీ..

0
37

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మరో టీడీపీ సీనియర్ నేత వైసీపీ గూటికి చేరారు. విశాఖ జిల్లా యలమంచలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకించడం వల్లే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు పంచకర్ల. జగన్ తోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే పంచకర్ల వైసీపీలో చేరడంపై బీజేపీ బాంబు పేల్చింది. చంద్రబాబు సూచనతోనే రమేశ్ బాబు వైసీపీలో చేరారని బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు బీజేపీలో చేరకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. దానికి బలమైన కారణం కూడా ఉందంటున్నారు.
ఏపీలో బలపడేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించాకా పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది. ఇక్కడే చంద్రబాబు కొత్త ఎత్తులకు దిగారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో బీజేపీ బలపడితే టీడీపీకి కష్టమని చంద్రబాబు భయపడుతున్నారని వారి వాదన. జాతీయ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతీయ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ బలంగా ఉంది. బీజేపీ బలపడితే అ ప్రభావం టీడీపీపైనే పడుతుందని అంచనా. బీజేపీ కనక అధికారంలోకి వచ్చే పరిస్థితి వస్తే టీడీపీ మనుగడే కష్టమని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందుకే వెళితే వైసీపీలోకి వెళ్లండి కాని బీజేపీలోకి వద్దని పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎదగకుండా అడ్డుకుంటే వైసీపీ తర్వాత మళ్లీ టీడీపీకే అధికారం వస్తుందని బాబు అనుకుంటున్నారని బీజేపీ వాదన.
మొత్తానికి టీడీపీ నేతలు వైసీపీలో చేరికలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు సంచలనం కల్గిస్తున్నాయి. వైసీపీలోకి చంద్రబాబే పంపిస్తున్నారన్నది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అందులో లాజిక్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ ప్రచారంపై టీడీపీ మాత్రం ఇంకా స్పందించలేదు. బీజేపీ ఆరోపణలపై టీడీపీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ మాత్రం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

-ఎస్.ఎస్.యాదవ్,సీనియర్ జర్నలిస్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here