కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు.. రెండు రాష్ట్రాలది అదే పట్టు.. జల వివాదం కొలిక్కి వచ్చేనా?

3
326

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతోంది. కృష్ణా జలాల వినియోగం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలపై రెండు రాష్ట్రాలూ పట్టు వీడడంలేదు. శ్రీశైలం డ్యామ్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీరు ఎత్తిపోసేలా ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తుండగా.. గతంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులే చేపడుతున్నామని ఏపీ సర్కార్ కౌంటరిస్తోంది. కృష్ణా బోర్డు కేటాయింపుల మేరకే నీటిని తరలిస్తామని అంతకంటే చుక్క నీటిని కూడా అదనంగా తరలించబోమని స్పష్టం చేస్తోంది. రెండు రాష్ట్రాల వివాదం కేంద్రం వద్దకు చేరింది. ఎవరి వాదన వారు వినిపిస్తూ నివేదికలు సమర్పించారు. ఒకరి ప్రాజెక్టులపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సిన కేంద్రం మాత్రం డబుల్ స్టాండర్డ్ విధానాలు అవలంభిస్తోంది. దీంతో జల వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
రాయలసీమ ప్రాజెక్ట్ అక్రమమని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయగానే స్పందించిన కేంద్ర జల వనరుల శాఖ.. ప్రాజెక్టులపై ముందుకు వెళ్లవద్దని ఏపీ సర్కార్ ను ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం చేపట్టారని అభిప్రాయపడిన కేంద్రం..అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాతే , అన్ని అనుమతులు వచ్చాకే టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దంటూ వరుస లేఖలతో ఘాటుగానే హెచ్చరించింది కేంద్ర జల వనరుల శాఖ. దీంతో ఏపీ కొత్త ప్రాజెక్టులు అక్రమమన్న తెలంగాణ సర్కార్ వాదనను కేంద్రం సమర్ధిస్తున్నట్లు అంతా భావించారు. కేంద్ర జల వనరుల శాఖ తీరుపై ఏపీ ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ బీజేపీ నేతలు తామే ఏపీ ప్రాజెక్టును అపామని గొప్పగా ప్రకటించుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపణలు చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు పర్యావరణ అనుమతులపై పాలమూరు రైతు వేసిన పిటిషన్ పై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో జరుగుతున్న విచారణలో మాత్రం కేంద్రం మరోలా స్పందించింది. ఏపీ వాదనను సమర్ధించేలా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమేనని స్పష్టం చేసిన కేంద్రం.. దానివల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని తెలిపింది . లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను సాగునీటిప్రాజెక్ట్ , విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ లుగా పరిగణించలేమని పేర్కొంది. గత ప్రాజెక్ట్ లకు ఫీడర్ గా మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేస్తుందని , అంతే తప్ప దానితో అదనపు ఆయకట్టు సాగుకు అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతులు అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఏపీ వాదనకు సమర్ధనగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని అఫిడవిట్ లో వెల్లడించింది. తెలుగు గంగ , గాలేరు నగరి సుజల స్రవంతి , శ్రీశైలం కుడి కాల్వలకు గతంలోనే వేర్వేరు అనుమతులు తీసుకున్నారని స్పష్టం చేసింది. ఎన్జీటీలో కేంద్రం వేసిన అఫిడవిట్ పై ఏపీ సర్కార్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కేంద్ర సర్కార్ విధానాలతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం త్వరగా సమసిపోయేలా కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదని, టెండర్లు ఖరారు చేయవద్దని జల వనరుల శాఖ ఆదేశించడం.. పాత ప్రాజెక్టులే కొనసాగిస్తున్నారని, రూల్స్ విరుద్ధంగా ప్రాజెక్ట్ లేదని ఎన్జీటీలో అఫిడవిట్ వేయడంతో గందరగోళం నెలకొంది. కేంద్రంవైఖరి అలా ఉండగా.. రెండు రాష్ట్రాలు తమ పంథాలో ముందుకు పోతున్నాయి. అపెక్స కౌన్సిల్ సమావేశంలో ఏపీ అక్రమాలను ఎండ గట్టి ప్రాజెక్టును అడ్డుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఏపీ మాత్రం ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఎన్జీటీ తుది తీర్పు రాగానే పనులు వేగవంతం చేేసుందుకు సిద్ధమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీకి రెండు రాష్ట్రాలు పోటాపోటీ వ్యూహాలు పన్నుతున్నాయి. కేంద్రం ఎలా ముందుకు వెళుతుందన్నది ఆసక్తిగా మారింది. నిజానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు5న జరగాల్సి ఉండగా .. కేసీఆర్ వాయిదా కోరారు. ఆగస్టు 25న రెండోసారి డేట్ ఫిక్స్ చేసినా.. కేంద్ర జల వనరుల శాఖా మంత్రికి కరోనా సోకడంతో మళ్లీ వాయిదా పడింది. దీంతో జల వివాదంపై త్వరలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీ కీలకంగా మారింది.

-ఎస్.ఎస్.యాదవ్, సీనియర్ జర్నలిస్టు

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here