ఐరోపా ‘ఆఖరు నియంత’పై ఓ గృహిణి పోరాటం..

0
44

బెలారస్ ..యూరప్ లోని ఓ చిన్న దేశం. రష్యా పక్కనే ఉంది. ప్రస్తుతం ఈ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో. గత 26 సంవత్సరాలుగా ఎదురు లేకుండా బెలారస్ ని పాలిస్తున్నాడు. యూరప్‌లో అత్యంత సుదీర్ఘ కాలంగా పరిపాలిస్తున్న నాయకుడు ఇతడే. 1990వ దశకం ఆరంభంలో సోవియట్ యూనియన్ పతనం అనంతరం తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి వచ్చారు. మొదటి నుంచి ఆయన నిరంకుశ పాలకుడిగా పేరుపడ్డారు. సోవియట్ కమ్యూనిజం పోకడలనే ఆయన ఇప్పటికీ అనుసరిస్తున్నారు. తయారీ రంగం చాలా వరకూ ప్రభుత్వ సంస్థల యాజమాన్యంలోనే ఉంది. ప్రధాన మీడియా చానళ్లు ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తాయి. శక్తివంతమైన రహస్య పోలీసు విభాగాన్ని ఇప్పటికీ కేజీబీ అనే పిలుస్తున్నారు. విదేశీ దుష్ట శక్తుల నుంచి దేశాన్ని కాపాడుతున్న నేతగా..కరుడుగట్టిన జాతీయవాదిగా చెప్పుకుంటూ అధికారాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు.

అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన పట్ల వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. అంతులేని అవినీతి గురించి, కడు పేదరికం.. అవకాశాల లేమి, తక్కువ వేతనాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ మార్పును గుర్తించిన ప్రతిపక్ష నాయకులు లుకాషెంకోపై పోరాడేందుకు చేతులు కలిపారు..దీంతో ఆయన అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డారు. ప్రత్యర్థి అభ్యర్థులు ఇద్దరిని జైలులో పెట్టారు. మరొకరు దేశం వదిలి పారిపోయారు. దీంతో ఈ ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉన్న ముగ్గురు మహిళలు శక్తివంతమైన సంకీర్ణంగా ఏర్పడ్డారు. ఆ ముగ్గురు మహిళలలో ఒకరు 37 ఏళ్ల స్వెత్లానా టికనోవ్‌స్కయా. ఆమె ఓ సాధారణ గృహిణి. అధ్యక్ష బరిలో నిలిచిన ఆమె భర్త అరెస్టయ్యాడు. దాంతో తన భర్త స్థానంలో అభ్యర్థిగా నిలిచారు. ఆమెతో పాటు ఇద్దరు మిత్రపక్షాల నాయకురాళ్లు కలిసి దేశమంతా పర్యటించారు. జనం వీరి సభలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయని ప్రతిపక్షం ఆందోళన చెందింది. అనుకున్నంతా అయ్యింది. ఎన్నికల్లో అనేక అవతవకలు జరిగాయి. ఇంటర్నెట్‌పై సెన్సార్ విధించారు. లుకాషెంకో 80 శాతం ఓట్లు గెలిచారంటూ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి టిఖానోవ్‌స్కయాకు కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నాయి. ఇక ఫలితం ఎలా ఉండబోతోందో ఇవి చెప్పకనే చెప్పాయి. అయితే.. ఓట్లను సరిగ్గా లెక్కించిన చోట తనకు భారీ మెజార్టీ వచ్చినట్టు టిఖానోవ్‌స్కయా బలంగా వాదించారు. అంతేగాక ఫలితాలను బాహాటంగా తారుమారు చేశారని జనం కూడా నమ్ముతున్నారు. దాంతో వారు ఆగ్రహంతో విధుల్లోకి వచ్చారు.


ఎన్నికల రోజు పలు నగరాలలో హింస చెలరేగింది. వేలాది మందిని అరెస్ట్ చేశారు. ఎన్నికల తర్వాతి రోజు.. ఫలితాల్లో అవకతవకల గురించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయటానికి టిఖనోవ్‌స్కయ ప్రయత్నించారు. ఆమెను ఏడు గంటల పాటు నిర్బంధించారు. దేశం విడిచి లిథువేనియా వెళ్లేలా బలవంతం చేశారు. దీనికి ముందే ఆమె తన పిల్లలను అక్కడికి పంపించారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ.. తన సొంత బలాన్ని తాను ఎక్కువగా అంచనా వేసుకున్నానని.. తన పిల్లల క్షేమం కోసం దేశం విడిచి వెళుతున్నానని చెప్పారు.

కథ అంతటితో అయిపోలేదు. ఎన్నికల అనంతర ఘర్షణల్లో పోలీసుల క్రూరత్వం వెలుగులోకి రావటం మొదలైంది. నిర్బంధించిన వారిని తీవ్రంగా కొట్టారు. వారిని ఇరుకు జైళ్లలో కుక్కారు. దాష్టీకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో మళ్లీ నిరసనల వెల్లువ మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష నేత స్వెత్లానా టిఖనోవ్‌స్కయా తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన కొద్ది రోజుల తర్వాత.. అధికార బదిలీని నిర్వహించటానికి ‘సమన్వయ మండిలి’ని ఏర్పాటు చేయటానికి పటిష్ట ప్రణాళికను ప్రకటించారు. ”పౌర సమాజ ఉద్యమకారులు, బెలారస్‌లో గౌరవనీయులు, నిపుణులతో” ఈ మండలిలో ఉంటారని చెప్పారు. వారాంతంలో శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఆగస్టు 16న నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సెంట్రల్ మిన్సిక్‌కు జనం పోటెత్తారు.


ప్రస్లుతం బెలారస్ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రాజధాని మిన్సెక్‌లో నిరసనల పర్వం కొనసాగుతోంది. విపక్ష మద్దతుదారులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. భారీగా పోలీసులను మోహరించినప్పటికీ సెంట్రల్ స్క్వేర్‌లో వేల మంది నిరసనకారులు గుమిగూడారు. లుకాషెంకో రాజీనామా చేయాలని, ఆయన రిగ్గింగ్ చేశారని వారు నినదిస్తున్నారు. అయితే, కల్లోల పరిస్థితుల్ని అదుపులోకి తెస్తామని లుకాషెంకో ప్రతినబూనారు. నిరసనలను విదేశీ శక్తుల కుట్రగా ఆయన అభివర్ణించారు. తాజా నిరసనల్లో నలుగురు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

తాజా నిరసనల్లో చిన్నా పెద్ద అంతా కలిసి పాల్గొంటున్నారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎరుపు, తెలుపు రంగు జెండాలు పట్టుకొని వారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.దాదాపు లక్ష మంది నిరసనలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో లుకాషెంకోను రష్యా అధ్యక్షుడు కాపాడతాడా అన్న దానిపై చర్చ జరుగుతోంది. బెలారస్ ఆర్థికంగా చాలా వరకు రష్యా మీదనే ఆధారపడుతుంది. అయితే రష్యా అద్యక్షుడు వ్లాడిమీర్ పుతిన్ మాత్రం లుకాషెంకో తీరుపై గుర్రుగా ఉన్నారు. బెలారాస్ ను ఎవరు పాలిస్తున్నారన్నది పుతిన్ కి ముఖ్యం కాదు. అధికారంలో ఎవరు ఉన్నా రష్యా కనుసైగల్లో ఉండటమే దానికి కావాల్సింది. పుతిన్ ని ప్రసన్నం చేసుకునేందుకు లుకాషంకో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here