బీహార్‌లో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. బీజేపీ మిత్రపక్షాల మధ్య విభేదాలతో ఆ రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి ఇరకాటంలో పడింది. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలలో ఎల్జెపి 143 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తాజాగా లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జెపి) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నేడు ప్రకటించారు. ఇది బీజేపీకి ఆయన చేస్తున్న హెచ్చరిక వంటిది. రాష్ట్ర ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ (జెడియు) అధినేత నితీష్‌కుమార్‌కు వ్యతిరేకంగా కూడా అభ్యర్థులను నిలబెట్టేందుకు తాను వెనకాడనని పాశ్వాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఎల్‌జెపితో తమకు ఎలాంటి పొత్తు లేదని జెడియు ఇటీవల చెప్పిందని ఈ సందర్భంగా ఆయన బిజెపికి గుర్తు చేశారు. దీంతో జెడియుకు వ్యతిరేకంగా కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని అన్నారు. సీట్ల సర్దుబాటుపై చిరాగ్ పాశ్వాన్ సోమవారం బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా, బీహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీలలో మూడు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏదేమైన ఈసారి బీహార్ ఎన్నికలు మునపటికన్నా రసవత్తరంగా సాగనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.