బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, లేక్ యాక్టివిస్ట్ కవితా రెడ్డి కన్నడ నటి సంయుక్త హెగ్డెకు క్షమాపణ చెప్పారు. శుక్రవారం జరిగిన ఘటనకు తాను చింతిస్తున్నానంటూ ట్విటర్ లో వీడియో పోస్ట్ చేశారు. తాను ఎప్పుడూ మోరల్ పోలిసింగ్ కు వ్యతిరేకమని , నా చర్యలు అలాంటివి అని నేను గ్రహించాను. ఒక వాదన నాలో దూకుడుగా స్పందించింది, అది పొరపాటు. బాధ్యతాయుతమైన పౌరుడుగా, ప్రగతిశీల మహిళగా, సంయుక్త హెగ్డే , అలాగే ఆమె స్నేహితులకు హృదయపూర్వకంగా క్షమాపణ చెపుతున్నానంటూ కవితా రెడ్డి ట్వీట్ చేశారు
.అసలు ఏం జరిగిందంటే..
శుక్రవారం ఎక్సర్ సైజ్ చేసేందుకు కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే తన స్నేహితులతో కలిసి సంయుక్త బెంగళూరులోని ఓ పార్క్‌కు వెళ్లింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఆమె వేసుకున్న దుస్తులను చూసి కోపంతో ఊగిపోయింది. స్పోర్ట్స్ బ్రా వేసుకుని జనం తిరిగే చోటుకు ఎలావస్తావంటూ తిట్ల దండకం మొదలు పెట్టింది. పార్కులో ఉన్న మరికొందరు కూడా ఆ మహిళకు సపోర్ట్ చేశారు. అంతా కలిసి సంయుక్తతోపాటు ఆమె స్నేహితులపై దాడి చేశారు. దాడికి దిగిన మహిళను కవితారెడ్డిగా గుర్తించారు.
సంయుక్త హెగ్డే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బెంగళూరు పోలీసులను కోరారు. తమ దగ్గర మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. దీంతో దిగి వచ్చిన కవితారెడ్డి తన చర్యకు బాధపడుతున్నానంటూ సంయుక్తకు క్షమాపణ చెప్పారు. మరి సంయుక్త హెగ్డే క్షమిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఆమె తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్నారు. తెలుగులో ‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నటించారు.