కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత …

0
44

కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని సామెత. మీడియాలో పనిచేసే చాలా మంది మిత్రులకు పైత్యం పాలు కొంతకాదు..బాగానే ఉంటుంది. మీడియాలో కులవర్గ స్వభావాన్నిబయటపెట్టే ఒక ఉదాహరణ చూద్దాం. ఓసారి ఓ దినపత్రికలో బ్యానర్‌ ఐటమ్‌. పెద్ద హెడ్డింగ్‌..” తమిళతంబిపై తెలుగుతేజం విజయం’ ! అటు కేంద్రమంత్రి అన్బుమణి రామ్‌దాస్‌- ఇటు పద్మభూషణ్‌ డా. వేణుగోపాల్‌ ఫోటోలు. దేశంలోనే తొలి గుండెమార్పిడి ఆపరేషన్‌ చేసి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వేణుగోపాల్‌ను ఎన్డీయే గవర్నమెంట్‌ ఎయిమ్స్‌కి బాధ్యుడిగా నియమించింది. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్‌లో ఆరోగ్యశాఖమంత్రిగా ఉన్న అన్బుమణికీ, ఆయనకీ పొసగలేదు. ఇద్దరికీ ఆధిపత్యపోరు ముదిరిపోయింది. చివరికి ఆ డాక్టర్‌ గారిని డిస్మిస్‌ చేశాడు మంత్రి రాందాస్‌. ఆయన కోర్టుకెళ్లి విజయం సాధించాడు. అదీ విషయం. ఆ రోజు రాత్రి ఆ పత్రిక సెంట్రల్‌డెస్క్‌కి ఫోన్‌ చేసి – ” ఇది తెలుగు – తమిళ ప్రజల మధ్య వివాదమా? ‘ అని అడిగితే కాదన్నారు. పోనీ హైదరాబాద్‌లో పనిచేసే ఓ పంజాబీ ఉద్యోగికీ, మంత్రి జానారెడ్డికీ ఇటువంటి వివాదమే వచ్చి – ఆ ఉద్యోగి గెలిస్తే – ” తెలుగోడిపై పంజాబీ విజయం’ అని పెడతారా ? అని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. అప్పట్లో డా. వేణుగోపాల్‌ మీద సామాజికన్యాయ వ్యతిరేకి అని , ఎస్‌సి, ఎస్టీ విద్యార్థులపై వివక్ష చూపుతున్నారనీ ఆరోపణలు… పార్లమెంటు ఆమోదించిన 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఆయన ఎయిమ్స్‌లో అమలు చేయడానికి ఇష్టపడటం లేదనీ, కోటాకి వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారనీ విమర్శలు…ప్రొఫెసర్‌ థోరట్‌ నేతృత్వంలోని ఓ కమిటీ – ఈ ఆరోపణల్లో నిజముందని తేల్చింది. మొత్తం మీద, హార్ట్‌ స్పెషలిస్ట్‌ హృదయంలో ఏముందో తెలిసింది కదా.. ఆయన విజయం గురించి వార్త రాసిన వారిలో , ఎందుకంత ఉత్సాహం పొంగిందో- ఏ వ్యతిరేకత, ఏ అనుకూలత పనిచేశాయో అర్థమైంది కదా ! వాళ్లు దాన్ని నేరుగా రాయలేక, బాగుండదు కాబట్టి – ప్రాంతాల ముసుగులో సెలబ్రేట్‌ చేసుకుని ఉంటారని అనుమానం. ఆ విషయం అలా ఉంచితే, ఇక్కడ సామాజిక న్యాయం కోసం పోరాడినట్టు బిల్డప్‌ ఇచ్చిన అన్బుమణి, అతడి పార్టీల అసలు రంగు – కొన్నేళ్ల తర్వాత ఓ ప్రేమపెళ్లితో బయటపడిపోయింది. బీసీలైన వన్నియార్లు, అన్బుమణి తండ్రి – రాందాస్‌ నేతృత్వంలో పెట్టుకున్న పార్టీ పిఎంకె. ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు – దివ్య, ఇలవరసన్‌ల ఘటనలో మనువాదుల ముత్తాతలను తలపించారు. దళితవాడలను తగలేయడంతో మొదలుపెట్టి, మిగతా బీసీకులాలన్నింటినీ దళితులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టటం, కులాంతర వివాహాలను నిషేధించాలని తీర్మానాలు చేయటం, దళితులను బెదిరించటం, దాడులు చేయడం వరకూ…తమిళనాడులో చాలా బీభత్సమే సృష్టించారు.
అనేక విషయాల్లో ఇంకా వెనుకబాటుతనం ఉంటే ఉండొచ్చు కానీ, మనువాదంలో- సామాజిక అన్యాయంలో – అగ్రకులాలకంటే నాలుగడుగులు ముందే ఉంటామని నిరూపించుకుంది – రాందాసుల పార్టీ! ఎందరో దాసులు, దాసానుదాసులు…ఎవరి పల్లకీలో మోసే బోయీలు !

-ఎస్.ఎస్.రావు, సీనియర్ జర్నలిస్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here