మోడీ సర్కార్ పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు ..భారత్‌లో కార్యకలాపాలకు ఇక దూరం..

0
97

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత్‌ లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. విదేశీ నిధుల సేకరణలో అక్రమాలు జరిగాయంటూ ఉద్దేశపూర్వకంగానే భారత్‌ తమ బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసిందని అమ్నెస్టీ ఇండియా పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల పదో తేదీ నుండి తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేసిందని చెప్పింది.
నిరాధారమైన, ఉద్దేశపూరిత ఆరోపణలపై భారత ప్రభుత్వం మానవహక్కుల సంస్థలపై దాడి చేయడం ప్రారంభించిందని ఆమ్నెస్టీ పేర్కొంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇది అన్ని భారతీయ, అంతర్జాతీయ చట్టాలకులోబడి పనిచేస్తుందని వివరించింది. ఇటీవల జమ్ము కాశ్మీర్‌ ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సమయంలో అక్కడ జరిగిన మానవహక్కుల ఉల్లంఘన, ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లపై మోడీ సర్కార్‌కు ప్రశ్నలను సంధించింది. దీంతో ఆమ్నెస్టీపై దాడికి దిగిందని పేర్కొంది.

కాగా, గత రెండు సంవత్సరాలుగా ఆమ్నెస్టీ కార్యకలాపాలు రద్దు చేయడం ప్రమాదవశాత్తు జరిగిందని కాదని, ఉద్దేశపూర్వకంగానే దాడి చేసేందుకు ఈవిధంగా చేసిందని పేర్కొంది. అలాగే ఇడితో సహా ప్రభుత్వ సంస్థలు నిరంతరం దాడి చేస్తున్నాయని పేర్కొంది. ఢిల్లీ అల్లర్లతో పాటు జమ్మూ కశ్మీర్‌ అంశాలలో మానవహక్కుల ఉల్లంఘనలపై కేంద్రం సమాధానమివ్వడం లేదని అన్నారు. దీంతో అప్రజాస్వామికంగా తమ ఖాతాలను సీజ్‌ చేసిందని ఆమ్నెస్టీ సంస్థ డైరెక్టర్‌ అవినాష్‌ కుమార్‌ తెలిపారు.

అంతేకాదు… మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని గ్రూప్‌ సీనియర్‌ రీసెర్చ్‌, అడ్వకేసీ అండ్‌ పాలసీ డైరెక్టర్‌ రజత్‌ ఖోస్లా చెప్పారు. ఫలితంగా భారత లో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం మాపై ఓ పద్దతి ప్రకారం దాడులు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతోందని రజత్ ఖోస్లా ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here